నటుడు మోహన్‌బాబు కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మంగళవారం చోటుచేసుకున్న పలు పరిణామాల దృష్ట్యా బుధవారం ఉదయం జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మనోజ్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన బయటే బైఠాయించారు.
తన కారు పోయిందని మంగళవారం మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకొని ఆయన సోదరుడు విష్ణు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. ఈనెల 1న మా పాప పుట్టినరోజు సందర్భంగా…. జయపుర వెళ్లగా నా సోదరుడు విష్ణు 150 మందితో జల్పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశారని ఆరోపించారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు. నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశారు. జల్పల్లిలో నా భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్‌కు పంపించారు…అని మనోజ్ మీడియాతో చెప్పారు.