HomeEditorialEditorial : ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు : అడ్డగోలు వాదనలు తప్ప...

Editorial : ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు : అడ్డగోలు వాదనలు తప్ప అచ్చేదిన్‌ జాడ ఎక్కడ మోడీ జీ !

Published on

spot_img

– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.

చిల్లర ద్రవ్యోల్బణం పద్నాలుగు నెలల గరిష్టం 2024 అక్టోబరు నెలలో 6.21శాతానికి చేరింది. ఆహార ద్రవ్యోల్బణం అంతకు మించి 15నెలల గరిష్టం 10.87శాతానికి చేరింది.ఏడాది క్రితం అక్టోబరు నెలలో 6.61శాతమే ఉంది. ఈ అంకెలను మోడీని వ్యతిరేకులు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వ జాతీయ గణాంక సంస్థ(ఎన్‌ఎస్‌ఓ) వెల్లడిరచినవే. ప్రతినెల 12వ తేదీన ధరలు, ద్రవ్యోల్బణం సంబంధిత అంశాలను ఎన్‌ఎస్‌ఓ విడుదల చేస్తుంది. గతంలో మోడీ మంత్రదండపు విజయగాధలను గానం చేసిన వారు ఇప్పుడు మాట్లాడటం లేదు. దేవునిబిడ్డ అతీంద్రియ శక్తులు ఏమైనాయో తెలియటం లేదు. వాటిని జనం నమ్మటం లేదని తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిరచాయి. సావిత్రీ నీ పతిప్రాణంబు తప్ప వేరే కోరికలు కోరుకొమ్మని యమధర్మరాజు చెప్పాడన్న కథ మాదిరి నరేంద్రమోడీ గతంలో చెప్పిన వాటిని తప్ప కొత్త్త అంశాలను మాత్రమే చెబుతున్నారు. మాటల మాంత్రికుడు మరి. పదేండ్ల క్రితం ధరల పెరుగుదలతో జనాలకు చచ్చే రోజులు దాపురించటాన్ని నరేంద్రమోడీ చక్కగా వినియోగించుకున్నారు. తనకు అధికారమిస్తే అచ్చేదిన్‌ తెస్తానని చెప్పారు. ఇప్పుడా మాట కలలో కూడా ప్రస్తావించటం లేదు.

తమ మోడీ హయాంలో ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల రేటు తగ్గిందని, అది ఆయన గొప్పతనమే అని భక్తులు పారవశ్యంతో ఊగిపోతారు.2014 మార్చి నెలలో వినియోగదారుల(వస్తువుల) సాధారణ సూచిక 138.1 ఉంటే 2024 అక్టోబరు నెల అంచనా 196.8గా ఉంది. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే నిత్యావస వస్తువుల ఒక కిట్‌ ధర పదేండ్లలో రు.138.10 నుంచి రు 196.80కి పెరిగింది.విడివిడిగా అంటే కేవలం ఆహార వస్తువులనే తీసుకుంటే రు.140.70 నుంచి రు.209.40కి చేరింది. అచ్చేదిన్‌ అని నరేంద్రమోడీ చెప్పినపుడు అంతకు ముందున్న ధరలను తగ్గిస్తారని జనం అనుకున్నారు. అబ్బే తగ్గింపు అంటే ధరలు కాదు పెరుగుదల రేటు అని ఇప్పుడు టీకా తాత్పర్యాలను చెబుతున్నారు. గతంలో పది పెరిగితే ఇప్పుడు ఏడు మాత్రమే పెంచుతున్నాం అంటున్నారు. ఇది వాస్తవమా ? మోడీ తొలిసారి అధికారానికి వచ్చిన సమయంలో మనం దిగుమతి చేసుకొనే ముడి చమురుధరలు ఆకాశాన్ని అంటాయి. వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో పతనంతో దిగుమతి బిల్లు తగ్గి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. దీన్ని తన విజయంగా చెప్పుకున్నారు. 2014 జనవరి నుంచి 2019 జనవరి వరకు చూస్తే 22 నిత్యావసర వస్తువుల్లో పదింటి ధరలు పదిశాతం పెరిగాయి. పెసరపప్పు, బంగాళాదుంపలు, ఉల్లి ధరలు అంతకు ముందు ఉన్నవాటి కంటే కాస్త తగ్గాయి. తొమ్మిది వస్తువుల ధరలు పది నుంచి 40శాతం వరకు పెరిగాయి. సెనగపప్పు, పాల ధరలు 33,21శాతం చొప్పున పెరిగాయి. అదే 2019 జనవరి నుంచి 2024 జనవరి వరకు అన్ని వస్తువుల ధరలు 15శాతం పైగా పెరిగాయి తప్ప తగ్గలేదు. పన్నెండు సరకుల ధర 40శాతంపైన, ఏడిరటి ధర 50శాతం పైగా పెరిగింది.కందిపప్పు 110, ఉల్లి 107శాతం పెరిగింది. పప్పుధాన్యాల ధరల సూచిక 2014 మార్చి నెలలో 120.1 ఉంటే ఈ ఏడాది అక్టోబరులో 216.8గా ఉంది. జనం పప్పు తినటం మరచిపోయారు. ఇదంతా అచ్చేదిన్‌ కాలపు నిర్వాకం. ధరల పెరుగుదల యూపిఏ పాలన చివరి సంవత్సరాల నాటి స్థాయికి చేరే బాటలో ఉంది.గ్రామీణ ప్రాంతాలలో సాధారణ ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంది. అక్టోబరులో ఆహార వస్తువుల ధరల సూచిక ప్రకారం పట్టణాల్లో 10.69శాతం ఉంటే పట్టణాల్లో 11.09శాతం ఉంది.ఆహార ధరల పెరుగుదల ఇలా ఉన్న కారణంగానే జనం అవసరమైన మేరకు పోషకాహారం తీసుకోలేకపోతున్నారు.అలాంటి జనాలు రోగాల పాలు కావటం దాని మీద ఖర్చు మరొక భారం.మొత్తంగా ధరల పెరుగుదల కారణంగా వస్తువుల మీద విధిస్తున్న జిఎస్‌టి ఏడాది కేడాది పెరుగుతున్నది. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్దే దీనికి నిదర్శనం అంటూ పాలకులు తప్పుదారి పట్టిస్తున్నారు.

మనదేశంలో అత్యధికులు తమ ఆదాయాల్లో సగం మొత్తాన్ని ఆహారం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల పతనంలో ప్రకృతిలో వచ్చే మార్పుల ప్రభావం ఒక వాస్తవం. కానీ పెరిగినపుడల్లా తమకేం సంబంధం లేదు అంతా ప్రకృతి, దేవుడే చేశాడన్నట్లుగా చెప్పటం, తగ్గినపుడు అదంతా తమ ఘనతే అని జబ్బలు చరుచుకోవటం తెలిసిందే. ప్రభుత్వాలు, అవి రూపొందించే విధానాల వైఫల్యాల గురించి కావాలని దాచివేస్తున్నారు. నూనె గింజల ఉత్పత్తికి అవసరమైన అధికదిగుబడి వంగడాలను రూపొందించటంలో అధికారంలో ఎవరున్నా అన్ని పార్టీలు విఫలమయ్యాయి. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకొనే వంటనూనెలపై గరిష్టంగా 30శాతం వరకు దిగుమతి పన్ను విధించింది. ఆ మేరకు దిగుమతి చేసుకొనేవాటితో పాటు స్థానికంగా తయారయ్యే వాటి ధరలు కూడా పెరిగాయి. కొన్ని ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం 50శాతం పెంచింది, ఎందుకు అంటే జనానికి అవసరమైన వాటిని ఉత్పత్తి చేయాలంటే కంపెనీలకు గిట్టుబాటు కావటం లేదు, పెంచకపోతే ఉత్పత్తి మానివేస్తే జనానికే నష్టం అని చెబుతున్నారు. ఆహార ధాన్యాలు కూడా జనానికి అవసరమే. వ్యవసాయ ఉత్పత్తి పట్ల కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నదా ? 2014లో క్వింటాలు సాధారణ రకం ధాన్య కనీస మద్దతు ధర రు.1,310 కాగా ఇప్పుడు రు.2,183కు పెంచారు. మరోవైపు ధాన్య ఉత్పత్తి ఖర్చు ఇదే కాలంలో రు.644 నుంచి రు.1,911కు పెరిగిందని వ్యవసాయ పంటల ధరల,ఖర్చుల కమిషన్‌ చెప్పింది. ఈ ఖర్చుతో పోల్చుకుంటే మద్దతు ధరల పెరుగుదల ఎంత తక్కువో చెప్పనవసరం లేదు. ఆహారం లేకుండా ఔషధాలతోనే జన జీవితాలు గడుస్తాయా ? నరేంద్రమోడీ తన అద్భుత శక్తులతో అలాంటి మందు గోలీలను తయారు చేస్తే మంచిదే మరి !

యుపిఏ పాలనా కాలంలో ధరల పెరుగుదలను బిజెపి రాజకీయంగా సొమ్ము చేసుకుంది. తమకు అధికారమిస్తే ధరలను తగ్గిస్తామని నమ్మబలికింది.గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ 2012 మే 23,24 తేదీలలో మూడు ట్వీట్లు చేశారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత పెట్రోలు ధరల పెంపు ప్రకటన పార్లమెంటు గౌరవాన్ని భంగపరచటమే అన్నారు.(తన ఏలుబడిలో పార్లమెంటుతో నిమిత్తం లేకుండానే పెట్రోలు ధరలు, పన్ను మొత్తాలను నిర్ణయిస్తున్న అపర ప్రజాస్వామికవాది) పెద్ద మొత్తంలో ధరల పెంపుదల యుపిఏ ప్రభుత్వ వైఫల్యం, గుజరాత్‌ మీద వందల కోట్ల భారం పడుతుందన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలలో కంటే గుజరాత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల మీద విధిస్తున్న వ్యాట్‌ తక్కువ అన్నారు. యుపిఏ పాలనలో గ్యాస్‌ ధర పెరగ్గానే సిలిండర్‌ పట్టుకొని మీడియా ముందుకు పరుగుపరుగున వచ్చిన బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ గురించి చెప్పనవసరం లేదు. ‘‘ గ్యాస్‌ ధర యాభై రూపాయలు పెంచి కూడా తమది పేదల సర్కార్‌ అని చెప్పుకుంటున్నారు సిగ్గులేదు,యుపిఏ పాలనలో జిడిపి అంటే గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌ కాదు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు ధరలు, ఆరోసారి పెట్రోలు ధరలు పెంచారు, ఇదేమాత్రం సమర్ధనీయం కాదు, దీని వలన ద్రవ్యోల్బణం పెరుగుతుంది. యుపిఏ ప్రభుత్వ తప్పుడు విధానాల ఫలితంగానే పెట్రోలు ధరలు, గృహరుణాల వడ్డీ పెరుగుతున్నదని, కంపెనీల కోసమే పెట్రోలు ధరలు పెంచుతున్నారని , చైనా చొరబాట్లు, పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని, రూపాయి విలువ పడిపోయిందని, 60శాతం దేశపౌరులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతుంటే లౌకిక వాదం గురించి మాట్లాడుతున్నారంటూ ’’ 2010`13 సంవత్సరాలలో ట్వీట్లు చేశారు.

అదే బిజెపి పెద్దలు ఇప్పుడు గద్దె మీద ఉన్నారు. స్మృతి ఇరానీ లేదా ఆమె చేతిలో సిలిండర్‌గానీ ఎక్కడా కనిపించటం లేదు. గ్యాస్‌ ధర ఎంతో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిందేమిటి ఇప్పుడు చేస్తున్నదేమిటి ?ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చమురు ధరల పెరుగుదలను సమర్ధించుకొనేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ పేరును ఉపయోగించుకున్నారు.కొరియా యుద్ధం భారత ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపుతుందని 1951లోనే పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు. ప్రపంచమంతా ఒకటిగా ఉన్న ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్దం ప్రభావితం చేస్తున్నదని మేం చెబుతున్నాం, దాన్ని అంగీకరించరా ? చమురు కంపెనీలు అధిక ధరలకు చమురు దిగుమతి చేసుకుంటే దాన్ని మనం భరించాల్సిందే అని లోక్‌సభలో సమర్దించుకున్నారు. పోనీ ఈ తర్కానికైనా కట్టుబడి ఉన్నారా ? జనం పట్ల, ద్రవ్యోల్బణం తగ్గింపు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందా అన్నదే ప్రశ్న. అంతర్జాతీయ మార్కెట్లను బట్టి చమురు ధరలు నిర్ణయిస్తామని ప్రకటించి అమలు జరిపిన పెద్దలు రెండున్నర సంవత్సరాలుగా ఎందుకు నిలిపివేసిందీ నరేంద్రమోడీ ఎప్పుడైనా చెప్పారా ? 2022 ఏప్రిల్‌ నుంచి ఒకే ధరలను వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ముడి చమురు ధర 20శాతం తగ్గింది. ఆ మేరకు చూసుకుంటే పెట్రోలు, డీజిలు ధరలు కనీసం దానిలో సగం కూడా ఎందుకు తగ్గించలేదు. జనం జేబులు కొల్లగొట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీల రూపంలో కట్టబెడుతున్నది.చమురుపై పెంచిన సెస్సుల పేరుతో మోడీ సర్కార్‌ ఇప్పటి వరకు రు.26.74లక్షల కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి వసూలు చేసింది. ఈ భారం రవాణా రంగం, ఇతర వాటి మీద పడి అనేక వస్తువుల ధరలు పెరగటానికి దారి తీసింది. అందువలన ధరల పెరుగుదలకు ప్రకృతి మీదో మరొకదాని మీదో నెపం మోపితే కుదరదు.ద్రవ్యోల్బణాన్ని నాలుగుశాతానికి పరిమితం చేస్తామని ఆర్‌బిఐ పదే పదే చెప్పటం తప్ప ఆచరణలో అమలు జరగలేదు. జనం ఇబ్బందులు పడుతుంటే లౌకికవాదం గురించి కబుర్లు చెప్పారని విమర్శించిన బిజెపి పెద్దలు రోజూ మాట్లాడుతున్నదేమిటి ? హిందూమతానికి ప్రమాదం వచ్చింది, హిందూత్వను, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటూ ఊదరగొడుతున్నారు ! కనీసం హిందువులు, సనాతన వాదులమని ప్రకటించుకున్న బిజెపి, జనసేన వారికైనా హిందూమతం ధరలను తగ్గిస్తుందా ? జనాల కడుపు నింపుతుందా ? చమురు మీద పెంచిన పన్నులను అడ్డగోలుగా సమర్ధించుకున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగుతున్నారు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014 మే నెలలో ముడిచమురు పీపా ధర 113 డాలర్లు ఉంది, తరువాత 2015 జనవరిలో 50, 2016 జనవరిలో 29 డాలర్లకు పడిపోయినపుడు ధరలు తగ్గించకపోగా పెద్ద మొత్తాలలో సెస్‌ విధించారు. తరువాత ధరలు పెరిగినప్పటికీ సెస్‌ రద్దు చేయలేదు. ఇప్పుడు 70 డాలర్లకు అటూ ఇటూగా ఉంటోంది.సెస్‌ ఎందుకు విధించారయ్యా అంటే కరోనా వాక్సిన్‌ ఉచితంగా కావాలంటారు దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని పెట్రోలియం శాఖా మంత్రిగా పనిచేసిన రామేశ్వర్‌ తేలీ వాదించారు. తరువాత ఎత్తివేశారా అంటే లేదు, దేశ రక్షణకు అయ్యే ఖర్చుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని మరొకవాదన చేశారు. సెస్‌ ఎత్తివేత సంగతి తరువాత గత ఆరునెలల్లో తగ్గిన మేరకైనా ధర ఎందుకు తగ్గించటం లేదంటే నోరు విప్పటం లేదు. దీని సంగతేమిటో ప్రశ్నించాలా వద్దా ! లేక జేబులను కొల్లగొడుతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవాలా ?

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...