హైదరాబాద్ : నెల రోజుల్లో గ్రూప్ 2, 3 నియామకాలు పూర్తి చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన “ప్రజాపాలనలో కొలువుల పండగ” కార్యక్రమంలో ఆయన పాల్గొని “బిల్డ్ నౌ పోర్టల్”ను ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
గత పదేళ్లలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల పదేళ్లు నష్టపోయారని, జాబ్ క్యాలెండర్ తోపాటుగా కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందేనని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదని, స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదని అన్నారు. పేదలు, బడుగు,బలహీన వర్గాల వారే పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని, నిరుద్యోగుల బాధలను ప్రజాప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. అందుకే ఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలిచ్చామని అన్నారు సీఎం.
నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కారుణ్య నియామకాల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. నిరుద్యోగుల బాధలు తనకు తెలుసన్న సీఎం రేవంత్ రెడ్డి…ఉద్యో్గ ఖాళీలను పెండింగ్ పెట్టొద్దని ఆదేశాలిచ్చానన్నారు. 30,40 రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఉద్యోగాలిచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయిని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.