అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కిల్స్ ఇండియా యూనివర్శిటీకి అదానీ గ్రూప్ ఇటీవల ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తీసుకోవద్దని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో అదానీ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విమర్శల దృష్ట్యా ఈ విరాళం తిరస్కరించినట్లు వెల్లడించారు.
అదానీ విషయమై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందన్నారు. అమెరికాలో కేసు నమోదు కావడంతో ఈ చర్చ సాగుతోందన్నారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా నిధులు సేకరించిందని ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రభుత్వ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. నిబంధనల మేరకు తమ ప్రభుత్వం టెండర్లను పిలిచి ప్రాజెక్టులు ఇస్తోందని వెల్లడించారు.
దేశంలోని ఏ సంస్థకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. అంబానీ, అదానీ, టాటా.. ఇలా ఎవరికైనా తెలంగాణలోనూ వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. సీఎస్ఆర్ కింద మాత్రమే అదానీ గ్రూప్ స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. కానీ ఈ రూ.100 కోట్లను సీఎం, మంత్రులకు ఇచ్చినట్లుగా ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు లేఖ రాసినట్లు చెప్పారు.
స్పీకర్ కుమార్తె పెళ్లి కోసం ఢిల్లీకి వచ్చానన్న సీఎం
లోక్ సభ స్పీకర్ కుమార్తె వివాహం కోసం తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుత తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలపై రేపు ఎంపీలతో చర్చిస్తామన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి రేపు రాష్ట్ర సమస్యలను కేంద్రానికి వివరిస్తామన్నారు. కొంతమంది తాను 28సార్లు ఢిల్లీకి వచ్చినట్లు చెబుతున్నారని, కానీ వారిలో పైరవీలు చేయడానికో… బెయిల్ కోసమో తాను ఢిల్లీకి రావడం లేదన్నారు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సినవి రాబట్టుకోవడం కోసం వస్తున్నామన్నారు. అవసరమనుకుంటే ఢిల్లీకి ఎన్నిసార్లైనా వస్తానన్నారు.