VIJAYAWADA : ఊపిరి తీసేసిన “స్వర”..!

0
340

* విజయవాడ స్వర హాస్పిటల్ మరో నిర్వాకం

* కిడ్నీ రోగులు ప్రాణాలతో నిత్యం చెలగాటం..

* కిడ్నీ మార్పిడి పేరుతో లక్షల్లో దోపిడీ

* తాజాగా కిడ్నీ ఆపరేషన్ ఫెయిలై ఒకరు మృతి

* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడి భార్య

రోగులకు ఊపిరి పోయాల్సిన అక్కడి వైద్యులు నిలువునా ఊపిరి తీసేస్తున్నారు. కిడ్నీ మార్పిడి పేరుతో ప్రాణాలు తోడేస్తున్నారు. హాస్పిటల్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించకపోగా…వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ఈ హాస్పిటల్ పై ఎన్నో ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నా.. అక్కడి వైద్యులు, యాజమాన్యం తీరు మాత్రం మారడం లేదు.

విజయవాడ సత్యనారాయణపురంలోని స్వర హాస్పిటల్ సంచలనాలకు మారుపేరు. ఇప్పటికే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఆ హాస్పిటల్ పేరు మార్మోగుతోంది. గతంలోనూ ఓ వ్యక్తి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అతని కిడ్నీని కాజేసిందీ ఈ హాస్పిటల్ యాజమాన్యం. తాజాగా కిడ్నీ మార్పిడి పేరుతో ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలువునా తీసేసింది. దీంతో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని రోడ్డున పడిన బాధిత కుటుంబం న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.

కానూరు ఎస్.బి.ఐ.కాలనీకి చెందిన పొన్నెకంటి రమేష్ కిడ్నీ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నాడు. దీంతో రమేష్ ఫ్యామిలీ అతన్ని స్వర హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి కోసం ఈ ఏడాది ఆగస్టు నెలలో చేర్పించింది. రమేష్ తల్లి కిడ్నీ దానం చేయడంతో స్వర హాస్పిటల్ వైద్యులు అతనికి కిడ్నీ మార్పిడి చేశారు. కిడ్నీ మార్పిడి చేశాక 20 రోజుల తర్వాత జ్వరం రావడంతో హాస్పటల్ కి తీసుకొచ్చారు. అప్పటికే రమేష్ కిడ్నీ ఇనెఫెక్షన్ కి గురైనట్టు చెప్పారు. తామేమీ చేయలేమని, అక్కడి వైద్యులు చేతులెత్తేశారు.

అప్పటికే రూ.25 లక్షలు ఖర్చుపెట్టి స్వర హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి చేయించిన రమేష్ ఫ్యామిలీ.. ఇనెఫెక్షన్ రావడంతో మళ్లీ అక్కడికే తీసుకెళితే.. స్వర యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో చేసేదేమీ లేక గత నెల 21న బాధిత కుటుంబం రమేష్ ను విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడి వైద్యులు కిడ్నీలో బ్లడ్ క్లాట్ అయ్యిందని ఆ కిడ్నీని తొలగించారు. కిడ్నీ మార్పిడి ఫెయిల్ అయిందని ఆందోళన చెందిన బాధితుడు పొన్నెకంటి రమేష్.. ఈ నెల 17న (ఆదివారం) మధ్యాహ్నం విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది.

కిడ్నీ మార్పిడి నిమిత్తం తమకు స్వర హాస్పిటల్ లో 25లక్షల రూపాయల ఖర్చు అయ్యిందని, ఆపరేషన్ ఫెయిల్ కావడం వల్లే తమ భర్త చనిపోయాడని, దీనికి స్వర హాస్పిటల్ యాజమాన్యం బాధ్యత వహించాలని బాధితుడు రమేష్ భార్య సారిక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమకు ఇద్దరు చిన్నపిల్లలున్నారని, భర్త మరణంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని సారిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమకు స్వర హాస్పిటల్ యాజమాన్యం న్యాయం చేయాలని బాధిత కుటుంబం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కిడ్నీ మార్పిడి ఆపరేషన్ వికటించి మృతి చెందిన పొన్నెకంటి రమేష్..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here