ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే అందుకు ఇద్దరు వ్యక్తులే కారణమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వల్లే ఇది సాధ్యమైందన్నారు. మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ఉద్యమాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.
గతంలో ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపైనా విస్తృతంగా చర్చలు జరిగాయని అన్నారు. తాను కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి చూపించానని, ఉన్నతంగా ఆలోచించే దళిత మేధావులను కలిశానని తెలిపారు. తమ పేర్లకు చివర కులాల పేర్లను పెట్టుకోవడం అగ్రవర్ణాల్లోనే చూస్తుంటామని, కానీ మంద కృష్ణ తన పేరు చివరన కులం పేరును పెట్టుకోవడం సాహసోపేతం అని అభివర్ణించారు.
ఏపీలో మాల కులస్తులు ఎక్కువగా ఉంటారని, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటారన్న పవన్ కల్యాణ్… ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా కులాల జనాభాలో తేడాలు ఉన్నాయని తెలిపారు. ఇలా ఒక్కో చోట ఒక్కో కులం ఆధిక్యంలో ఉందని, ఈ నేపథ్యంలో వర్గీకరణ చేయడం అనేది ఎంతో సమతుల్యంతో చేయాల్సిన పని అని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ బిల్లును జనసేన తరఫున మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.