కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్‌రెడ్డి తమను సంప్రదించి, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి వద్ద సోషల్‌మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు వివరించారు.
చంద్రకిరణ్‌రెడ్డి మాతో కలిసి పనిచేస్తూ …తన సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నారు. స్వలాభం కోసం మా పేరును వాడుకున్నారు. అతని పనితీరు నచ్చకపోవడంతో చంద్రకిరణ్ సేవలను వినియోగించుకోలేదు. మేం భాజపాలో ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడింది. ఆ పార్టీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ మమ్మల్ని వాడుకున్నారు. భాజపాలో నుంచి బయటకు వచ్చాక అతడి నుంచి మెసేజ్ వచ్చింది. పెండింగ్‌లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా… అని అందులో ఉంది.
ఈక్రమంలో…. మావద్ద బకాయిలు ఏమీ లేవని సమాధానమిచ్చాం. అయితే ఏప్రిల్ 6న చంద్రకిరణ్‌రెడ్డి బెదిరింపు సందేశం పంపాడు. బకాయిలు తీర్చకుంటే… మీరు శత్రువులు అవుతారని మెసేజ్ చేశాడు. ఆమోదయోగ్యం కాని రీతిలో సందేశాలు ఉన్నాయి. చంద్రకిరణ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి…. అని శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.