– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.
అంతరిక్ష రంగంలో అమెరికాకు ధీటుగా 2050నాటికి అగ్రదేశంగా మారేందుకు చైనా మూడు దశల ప్రణాళికలు రూపొందించింది.వివిధ గ్రహాల గురించి పరిశోధన, ఒక అంతర్జాతీయ లూనార్ పరిశోధనా కేంద్ర నిర్మాణం వంటివి దీనిలో ఉన్నాయి.చంద్రుడి మీదకు 2030నాటికి వ్యోమగాములను పంపే లక్ష్యం కూడా ఉంది. ఆర్థికంగా చైనా ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నవారే ఈ పరిశోధనలకు భారీ మొత్తాలను ఎలా ఖర్చు పెడుతున్నదంటూ ఆశ్చర్యపోతున్నారు. దేశ చరిత్రను చూసినపుడు లక్ష్యాలను ప్రకటించిన నిర్ణీత కాలంలో పూర్తిచేసిన చరిత్ర ఉందని కూడా అంటున్నారు. తొలిసారిగా చంద్రుడికి ఆవలి వైపున రోవర్‌ను దించిన చైనా ఘనత తెలిసిందే.అంతరిక్ష లక్ష్యాల రోడ్ మాప్‌ను కేంద్ర కాబినెట్ స్థాయి కార్యాలయం పర్యవేక్షించనుంది.2028 నుంచి 2035వరకు మానవులను పంపే కార్యక్రమాలతో పాటు చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.మూడవ దశలో 30మిషన్‌లను ప్రయోగిస్తారు.ఐరోపా స్పేస్ ఏజన్సీతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తారు.తమ అంతరిక్ష పరిశోధన ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉందని, ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు చైనా అధికారులు చెప్పారు.
పశ్చిమ దేశాల్లో పరిశోధనలు చేయటం, చేతి నిండా సంపాదించటం ఎంతో మంది కనేకల. అది తప్పేం కాదు. స్వదేశంలో తమ మేథకు పదును పెట్టే అవకాశాలు, దానికి తగిన ప్రతిఫలం పొందే పరిస్థితి లేనపుడు ఎవరైనా ఇదే విధంగా ఆలోచిస్తారు. గతంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడి సంపాదించిన వారిని చూస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రపంచమంతటా ఇలాంటి ‘‘ డాలరు కలలు ’’ కనేవారు ఉన్నారు. దీన్నే మరో విధంగా మేథోవలస అనేవారు. ధనికదేశాలన్నీ ఇలాంటి వలసలను ప్రోత్సహించి సొమ్ము చేసుకున్నాయి. చైనా తాజాగా వెల్లడిరచిన సర్వే సమాచారం ప్రకారం ‘‘స్టెమ్’’ (సైన్సు,టెక్నాలజీ,ఇంజనీరింగ్,గణిత శాస్త్రాలకు పెట్టిన పొట్టి పేరు) పరిశోధనకు(పిహెచ్‌డి) విదేశాలకు వెళ్లిన చైనీయులలో 80శాతం మంది తిరిగి వస్తున్నారట. 1987లో కేవలం ఐదుశాతమే ఉండగా 2007లో 30.6శాతం నుంచి ఇప్పుడు 80శాతానికి చేరారు. ధనికదేశాల్లో అకడమిక్ అవకాశాల కోసం ఇప్పటికీ పెద్ద ఎత్తున పోటీ ఉంది.ఎందుకు చైనీయుల్లో ఇలాంటి మార్పు అని చూస్తే ప్రపంచ భూ భౌతికఆర్థిక శక్తిగా చైనా ఎదగటం తప్ప మరొక కారణం లేదు. స్టెమ్ గ్రాడ్యుయేట్లకు చైనాలో అవకాశాలు, ఆర్థిక ప్రతిఫలాలు కూడా ఏటేటా పెరుగుతున్నాయి.అయితే విదేశాల్లో ఇంకా ఆకర్షణ కొనసాగుతూ ఉంటే వలసలు మరోసారి కొనసాగవని చెప్పలేము.చైనాలో పెరుగుతున్న ఆర్థిక లబ్దితో పాటు, ఒకే బిడ్డ అన్న విధానం అమల్లోకి వచ్చిన తరువాత పుట్టిన తరానికి చెందిన వారు వృద్ద తలిదండ్రులను చూసుకోవాల్సిన కుటుంబ సంబంధాలు కూడా పరిశోధకులు తిరిగి రావటం వెనుక కారణాలుగా తేలాయి.పశ్చిమదేశాల్లో సంపాదించిన దానికి దగ్గరగా చైనాలో కూడా ఉండటంతో తిరిగి వచ్చేవారి వేగం పెరుగుతున్నది.
చైనాలో విద్య, పరిశోధనలకు పెద్ద పీటవేస్తున్న కారణంగా అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(జన్‌ఏఐ) పేటెంట్లకు దరఖాస్తున్నట్లు ప్రపంచ పేటెంట్ సంస్థ(డబ్ల్యుఐపిఓ) తాజా సమాచారం వెల్లడిస్తున్నది. ఈ రంగంలో అగ్రశ్రేణిలో ఉన్న అమెరికా, దక్షిణ కొరియా,జపాన్, భారత్‌ను చైనా అధిగమించింది. 2023తో ముగిసిన దశాబ్దిలో దాఖలైన 54వేల దరఖాస్తుల్లో నాలుగోవంతు గతేడాదిలోనే ఉన్నాయి.చైనా నుంచి 201423 సంవత్సరాలలో 38వేల దరఖాస్తులు వచ్చాయి.వేగంగా దూసుకువస్తున్న కృత్రిమ మేథ సాంకేతిక పరిజ్ఞానం ఆటతీరునే మార్చివేయనుంది. ఇదే కాలంలో 54వేల పేటెంట్ దరఖాస్తులతో పాటు 75వేల శాస్త్రీయ పత్రాల ప్రచురణ కూడా చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో జారీచేసిన అన్ని రకాల పేటెంట్లలో ఏఐ వాటా కేవలం ఆరుశాతమే. పది అగ్రశ్రేణి సంస్థలలో టెన్‌సెంట్(2,074, పింగ్ యాన్ ఇన్సూరెన్స్(1,564), బైడు(1,234), చైనీస్ సైన్స్ అకాడమీ(607), అలీబాబా (571) శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (468),ఆల్ఫాబెట్(443), బైట్‌డాన్స్(418), మైక్రోసాఫ్ట్ 377 ఉన్నాయి. మొత్తం దేశాల వారీ చూస్తే చైనా 38,210, అమెరికా 6,276, దక్షిణ కొరియా 4,155, జపాన్ 3,409, భారత్ 1,350 ఉన్నాయి. రంగాల వారీగా ఇమేజ్, వీడియో డేటా, 17,996,టెక్స్ట్ 13,494, మాటలు లేదా సంగీతం 13,480 ఉన్నాయి.విదేశాల్లో చదివి భారత్‌కు తిరిగి వచ్చే విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు ఉండటం లేదని కెనడా విద్యాసంస్థ ఎం స్క్వేర్ మీడియా (ఎంఎస్‌ఎం) తన సర్వేలో తేలినట్లు 2023 ఫిబ్రవరిలో ప్రకటించింది. విదేశీ డిగ్రీల గుర్తింపుతో సహా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారని తెలిపింది. 2022లో 7.7లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు.201519 మధ్య విదేశాల్లో చదువుకొని స్వదేశం తిరిగి వచ్చిన వారిలో 22శాతం మాత్రమే ఉపాధి పొందినట్లు తేలింది. విదేశీ డిగ్రీలు, డిప్లొమాలకు భారత్‌లో గుర్తింపు లేకపోవటం ఒక ప్రధాన సమస్య.
ప్రపంచ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న చైనా తన సత్తాను ఇతర రంగాలకూ విస్తరిస్తున్నది.2035 నాటికి అగ్రశ్రేణి విద్యాశక్తిగా మారేందుకు పథకాలను రూపొందించింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన విద్యాకేంద్రంగా మారేందుకు చూస్తున్నట్లు చైనా విద్యామంత్రి హువెయ్ జిన్‌పెంగ్ ఇటీవల ప్రకటించాడు.సైన్సు, ఇంజనీరింగ్ రంగాలలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సంయుక్త డిగ్రీకోర్సులతో సహా వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పాడు. అనేక ఇబ్బందులు, సవాళ్లు ఉన్నప్పటికీ అధ్యక్షుడు షీ జింపింగ్ మార్గదర్శకత్వంలో రూపొందించిన ప్రణాళికను అమలు జరపనున్నట్లు వెల్లడిరచాడు. పెద్ద విద్యాశక్తిగా ఉన్న స్థితి నుంచి బలమైన శక్తిగా మారేందుకు 2010లో నిర్ణయించామని, తాజా లక్ష్యాన్ని 2020లోనే ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆచరణలో పెట్టినట్లు జిన్ పెంగ్ చెప్పాడు.ఆర్థికంగా కొన్ని సమస్యలున్నప్పటికీ విద్యారంగ పథకాలను కొనసాగించాల్సిందేనని షీ జింపింగ్ నిర్దేశించాడు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ సమాచారం 2024 ప్రకారం 207 దేశాల విద్యారంగ సమాచారాన్ని విశ్లేషించగా చైనా 13వ రాంక్‌లో ఉండగా భారత్ 101. మనకంటే ఎగువన శ్రీలంక 61,నేపాల్ 56, దిగువన మయన్మార్ 109, బంగ్లాదేశ్ 122,పాకిస్తాన్ 136 స్థానాలలో ఉన్నాయి. విద్యార్థుల్లో 1823 సంవత్సరాల వయస్సు వారిలో ఉన్నత విద్యకు వెళ్లే వారు ప్రస్తుతం చైనాలో(జిఇఆర్) 60శాతం దాటారు, ఇది ఉన్నత మధ్యతరగతి ఆదాయ దేశాలకు సమానం. 2012లో ఇది 30శాతం మాత్రమే ఉండేది. అందరికీ ఉన్నత విద్యలో చైనా ప్రపంచ స్థాయికి ఎదిగింది. రానున్న ఐదు సంవత్సరాల్లో అమెరికా నుంచి 50వేలు, ఫ్రాన్సునుంచి మూడు సంవత్సరాలల్లో పదివేల మంది విద్యార్థులను మార్పిడి కార్యక్రమం కింద ఆహ్వానించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా మారేట్లు చైనా చూస్తున్నది. అక్కడ జరిగే పరిశోధన ఫలితాలను ఉత్పత్తి, సేవారంగాలలో వినియోగించే విధంగా వాణిజ్య స్థాయిలో విక్రయించేందుకు కూడా ప్రోత్సహిస్తున్నది తద్వారా ప్రభుత్వం కేటాయించే నిధులతో పాటు అదనంగా వచ్చే ఆదాయంతో మరింతగా పరిశోధకులను ప్రోత్సహించేందుకు వీలుకలుగుతుంది.ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, సాంకేతిక పరిజ్ఞానం అమల్లో వచ్చే ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించటం, నవీకరించే పరిశోధలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.ఫలితంగా ఈ పరిశోధనల విలువ 201923కాలంలో 150 నుంచి 290 కోట్ల డాలర్లకు పెరిగింది.దీనికి అనుగుణంగానే వార్షిక నివేదికలను విడుదల చేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సంఖ్య 3,447 నుంచి 4,028కి పెరిగింది. మార్కెట్లో తమ పరిశోధన ఫలితాలను అందచేసేందుకు చేసుకున్న ఒప్పందాలు కూడా 3,34 నుంచి 6.4లక్షలకు పెరిగాయి. వీటిలో 60శాతం స్థానిక సంస్థలవే కావటంతో ప్రాంతీయ అభివృద్ధికి ఎక్కువగా దోహదం చేస్తున్నాయన్నది స్పష్టం.
చైనా విద్యను కూడా ఎగుమతి చేయాలని చూస్తున్నది.దీనిలో భాగంగా అనేక దేశాలలో ఇంటర్నేషనల్ స్కూళ్ల స్థాపనకు పూనుకుంది. చైనీయులు అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు.వారి కుటుంబాలు తిరిగి రావాలంటే చైనా విద్య అవసరం ఎంతో ఉంది.చైనా స్కూళ్లలో ఏ పాఠ్యాంశాలనైతే బోధిస్తున్నారో వాటి నకలుతో దుబాయ్‌లో 500 చైనా కుటుంబాల విద్యార్థులతో స్కూలు నడుస్తున్నది. రానున్న రోజుల్లో అనేక దేశాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. దుబాయ్‌లో ప్రయోగాత్మకంగా 2020 నుంచి నడుస్తున్నది. అమెరికా,బ్రిటన్‌తో సహా 45 దేశాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశాలను చూడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ తన దౌత్యవేత్తలను కోరింది. ప్రపంచంలో కోటి మంది చైనీయులు ఆ దేశానికి చెందిన కంపెనీలలో పనిచేస్తున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్థానికులతో అలాంటి వారి పిల్లలు పోటీపడలేకపోతున్నారు. అందువలన చైనా భాష, సిలబస్‌తో ఆ లోపాన్ని అధిగమించేందుకు స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల వారిని కూడా ఈ స్కూళ్లకు ఆకర్షించేలక్ష్యం కూడా దీని వెనుక ఉంది. ఉదాహరణకు విదేశాల్లో నడిపే ఫ్రెంచి స్కూళ్లలో కేవలం నలభైశాతం మందే ఆ దేశానికి చెందిన వారుంటుండగా మిగతావారందరూ ఇతర దేశీయులే. అమెరికన్ స్కూళ్లలో పరిస్థితి కూడా ఇదే. చైనాలో కొన్ని ప్రైవేటు సంస్థలు స్కూళ్లను నడుపుతున్నాయి. ఇవి విదేశాల్లో కూడా చైనా స్కూళ్లను ప్రారంభిస్తే ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.