ఒక వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే….. ఆ వ్యక్తి భావ ప్రకటన హక్కును గౌరవించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి వివాదాస్పద వీడియో పోస్ట్‌కు సంబంధించిన కేసుపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగమని, దాన్ని రక్షించడం కోర్టుల బాధ్యత అని తెలియజేసింది.
కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలీస్తే…గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి గతేడాది తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 46 సెకన్ల నిడివి ఉన్నా వీడియోలో ఇమ్రాన్ ఓ పెళ్లి వేడుక మధ్యలో నడిచివస్తుండగా… ఆయనపై పూలవర్షం కురిసింది. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించింది. అయితే… ఆ పద్యంలోని పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఆరోపణలతో …. ఆయనపై కేసు నమోదైంది.
కేసును కొట్టివేయాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేసింది. ఎలాంటి నేరం లేకపోయినా.. అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ కేసు తీర్పులో భాగంగా వాక్ స్వాతంత్ర్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కవిత్వం, కళలు , నాటకం, సినిమాలు, వ్యంగ్యం, సాహిత్యం మనుషుల జీవితాన్ని అర్ధవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం… గౌరవప్రదమైన జీవించడం అసాధ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదని తెలిపింది. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడటం న్యాయస్థానాల విధి అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.