హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం కవిత ఇందిరాపార్కు వద్ద ఇవాళ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, అనుముల ఇంటెలిజెన్స్ అని విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. వారు పక్కకు తప్పుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ పని అని విమర్శించారు కవిత.
బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో కులగణన జరిగిందని, ఆ వివరాలు కూడా బహిర్గతం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల్లా తాము ఢిల్లీలో దొంగ దీక్షలు చేయబోమని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధిక దీక్ష చేస్తామని ఆమె అన్నారు.
బిల్లులను ఆమోదించి నాలుగు వారాలవుతోందని, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటో చెప్పాలని కవిత నిలదీశారు. బిల్లుల ఆమోదం తర్వాత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని చెప్పిన సీఎం… ఇప్పటి వరకు ఆ పనిచేయలేదని విమర్శించారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి స్నేహం ఉందని, అందుకే అఖిలపక్షాన్ని తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు. ఢిల్లీ దీక్షలో రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడారని, కానీ అక్కడ దీక్ష చేస్తే కేంద్రానికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11న పూలే విగ్రహంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
AI అంటే అనుముల ఇంటెలిజెన్స్
అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది, అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత pic.twitter.com/7uiwjReVQb
— INDIAN REPUBLIC TV (@irmediatv) April 8, 2025