WHEATHER: శుక్రవారం సాయంత్రం తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటివరకు ఎండలకు అల్లాడిపోయిన ప్రజలకు….సాయంత్రం వీచిన చల్లటి గాలులతో ఉపశమనం దొరికింది. ఇంక రాత్రి కురిసిన వర్షానికి హమ్మయ్య అనుకున్నారు. ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అనుకున్నట్లుగానే శుక్రవారం రాత్రి ఉరుములు ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో ఈదురు గాలులకు వృక్షాలు నేలకొరిగాయి. హోర్డంగ్ లు పడిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..అన్ని విభాగాల అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో..అధికారులకు సూచనలు చేశారు.
అయితే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కకడక్కడ పిడుగులు సైతం పడ్డాయి. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కూకట్ పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, ప్రగతిగనర్, బాచుపల్లి, మూసాపేట, ఎస్ఆర్‌నగర్, మధురానగర్, బోరబండ, ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చాలా చోట్ల వర్షం కురిసింది. వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. మెదక్ లోని జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఆ ఇంట్లోని సామాగ్రి ధ్వంసమైంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
అయితే మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వర్షాల తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు సామాన్యంగా ఉండటంతో పాటు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది. మరోవైపు, ఏపీలో ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.