తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాల్లో ముగ్గురు, ఐదుగురు న్యాయముర్తుల రాజ్యాంగ ధర్మాసనాలు తగిన సమయం అని చెప్పలేదని.. అలాంటప్పుడు వాటిని కాదని తామెలా వెళ్లగలమని సుప్రీం ప్రశ్నించింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి ఎలా రాయగలం అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.. పిటిషనర్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరవున న్యాయవాది అరియామా వాదనలు వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేరు వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందించలేదని.. వారికి నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో… నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయమని మాత్రమే హైకోర్టు గతంలో స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చిందని.. అయినప్పటికీ స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం .. విచారణ సందర్భంగా… ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసులు ఇచ్చారన్నారు. తాము ఫిర్యాదు చేసి దాదాపు ఏడాది పూర్తి అయిందని.. ఇప్పటికీ స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నవ్వుతూ చెప్పారు. తదుపరి విచారణను ఏప్రిల్ 2 కు వాయిదా వేసింది.