పశ్చిమ బెంగాల్: ఉపాధ్యాయ నియామక వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఈ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పునిచ్చింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న 25వేల టీచర్ల రిక్రూట్ మెంట్ చెల్లదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును… సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది.
2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని… అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది.
దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం… ఆ నియామక ప్రక్రియ కలుషితమైనది, కళంకమైనదిగా అభివర్ణించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. ఆ నియామకాలు చెల్లవని స్పష్టంచేసింది. అయితే, ప్రభావిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని…. సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే… దివ్యాంగ ఉపాధ్యాయులకు మానవతా కోణంలో ఊరట కల్పించింది. వారు విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది.