NASA: దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్..భూమిపైకి అడుగుపెట్టబోతున్నారు. క్రూ-10 తీసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్ సాయంతో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా టీంని క్రూ డ్రాగన్ క్యాప్సుల్ తిరిగి భూమిపైకి తీసుకొస్తుంది. సోమవారం సాయంత్రం వ్యోమగాములు ఎక్కగానే క్రూ డ్రాగన్ హ్యాచింగ్ మూసివేత పూర్తయింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష కేంద్రం నుంచి అన్ డాకింగ్ అయి తిరిగి భూ ఉపరితలం వైపుగా దూసుకొస్తుంది. నాసా అనుసంధానించిన ఈ విజయవంతమైన మిషన్, అంతరిక్ష పరిశోధనలో మరో గొప్ప మైలురాయిగా నిలవనుంది.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, మరో ఇద్దరు ఆస్ట్రోనాట్‌లతో కలిసి బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు భూమ్మీదకు చేరుకుంటారని నాసా ప్రకటించింది. ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ కానున్నారు.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో సునీత, విల్మోర్‌లు ISS కు చేరుకున్నారు. వారం రోజులకే తిరిగి భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్‌లు ISSలోనే చిక్కుకుపోయారు.
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆ లేఖలో సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని, ఆమెకు మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఆమె సాధించిన విజయాల పట్ల భారతీయులు గర్వపడుతున్నారని పేర్కొన్నారు.
అయితే ఇంతకాలం సున్నా గురుత్వాకర్షణ శక్తిలో ఉండటం వల్ల శరీరం కండరాలు బలహీనపడి నడవలేకపోవడం, నాడీ సమస్యలు, కంటి చూపు మందగించడం వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి భూమ్మీకు అడుగుపెట్టిన వెంటనే ఇక్కడి గ్రావిటీకి వారి శరీరం అలవాటు పడే వరకూ, బలం పుంజుకుని సరైన స్థితికి వచ్చే వరకూ వారిని కొన్ని వారాలు లేదా నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచనున్నారు. ఫ్లోరిడాలో ల్యాండ్ కాగానే ముందుగా క్రూని హ్యూస్టన్‌లో ఉన్న నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ వద్దకు తీసుకెళతారు. వైద్యపరీక్షలు, పోస్ట్ మిషన్ వంటి ప్రక్రియలు పూర్తిచేసి సాధారణ స్థితికి వచ్చే వరకూ చికిత్స ఇవ్వనున్నారు.