– డాక్టర్ కొల్లా రాజమోహన్,
మన రాష్ట్రంలో ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, సిలికా, మైకా,బాక్సైట్, గ్రానైట్, వజ్రాలు, బంగారం,వెండి, మాంగనీస్, రాగి, అల్యూమినియం, మాంగనీస్, బాక్సైట్, యురేనియం, ధోరియం లాంటివే కాకుండా భూమిలో లభించేటటువంటి శిలాజ ఇంధనాలు అంటే చమురు, సహజవాయువులను మైనింగ్ ద్వారా వెలికి తీస్తున్నారు. ఇంతకాలం వీటిపై పన్ను వేసే అధికారం, హక్కులు కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయి. వీటిపై హక్కులు ఆయా రాష్ట్రాలకే ఉండాలని చాలా సంవత్సరాలుగా ఆయా రాష్ట్రాలు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. చిట్ట చివరికి వారి న్యాయపోరాటం ఫలించి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, గనులు, ఖనిజాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని, కేంద్రానికి ఆ హక్కు లేదని, 2024, జూలై 25న 8-1 మెజార్టీతో తీర్పు ఇచ్చింది. తీర్పు రాష్ట్రాల అధికారాన్ని, ఫెడరలిజం స్ఫూర్తిని నిలబెట్టేదిగా ఉన్నది. ఖనిజాలు, నిక్షేపాలు గల భూమిపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని1989 లో కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లాయి. ఈ తీర్పు ఫలితంగా అప్పులలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను సంపద్వంతమైన రాష్ట్రాలుగా అభివృద్ధి పరచవచ్చు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్,ఛత్తీస్ గడ్ లాంటి రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి కేంద్రం వైపు ఆర్థిక సహాయం కోసం చూడవలసినటువంటి అవసరం ఉండకపోవచ్చు.
ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారం ఎవరిది?
ఇండియా సిమెంట్స్ Vs తమిళనాడు(1990) , కేశోరామ్ సిమెంట్స్ Vs వెస్ట్ బెంగాల్ రాష్ట్రం(2004), మధ్య నడిచిన కేసులలో పరస్పర విరుద్ధ మైన తీర్పులు వచ్చాయి. రాయల్టీ పన్ను ఔనా ? కాదా? రాష్ట్రాలకు పన్ను విధించే అధికారం వుందా లేదా ? ఖనిజాలు, ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారం ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వానిదా లేక కేంద్ర ప్రభుత్వానిదా? అనే విషయంపై కొన్ని దశాబ్దాల నుండి వాదోపవాదాలు నడుస్తున్నాయి. వందల కేసులు ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్ లోఉన్నాయి. కోర్టుల్లో నడిచిన ముఖ్యమైన కేసులు- 1)రాజ్యాంగం లోని 246 ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి 1957 లో మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ MMDR చట్టాన్ని పార్లమెంటు తెచ్చింది. ఆ చట్టం కింద సెక్షన్ 9 ద్వారా ఖనిజాలను తీస్తున్నవారు రాయల్టీని యూనియన్ ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. 2) తమిళనాడు ప్రభుత్వం లైమ్ స్టోన్ ఖనిజాన్ని వెలికితీస్తున్న ఇండియా సిమెంట్స్ పై 7వ షెడ్యూల్ లోని రాష్ట్ర జాబితాలోని 49, 50 ఎంట్రీ ల ప్రకారం భూమిపన్నును విధించింది. ఇండియా సిమెంట్స్ Vs తమిళనాడు కేసులో 7 గురు సభ్యులున్న సుప్రీంకోర్టు బెంచ్, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ MMDR చట్టం ప్రకారం, రాయల్టీపై సెస్స్, పన్ను విథించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాయల్టీ అంటే పన్ను అన్నారు. 3) కేశోరామ్ ఇండస్ట్రీస్ Vs వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మధ్య నడిచిన కేసులో, రాజ్యాంగ బెంచ్ తద్విరుద్ధ మైన తీర్పు ఇచ్చింది. పన్ను విథించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. రాయల్టీ అంటే పన్ను కాదన్నారు. అంతకుముందు ఇండియా సిమెంట్స్ Vs తమిళనాడు కేసులో ఇచ్చిన తీర్పు నిర్ణయం అనుకోకుండా తప్పిదం నుండి ఉద్భవించిందన్నారు. రాయల్టీ పన్ను కాదన్నారు.
పన్ను విధించే శాసనాధికారం రాష్ట్రాలకే వున్నది!
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 8-1 మెజార్టీతో ఇచ్చిన తీర్పులో—ముఖ్యమైన అంశాలు. ఎ) ఖనిజ హక్కులపై పన్ను విధించే శాసనాధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. యూనియన్ జాబితాలోని ఎంట్రీ 54 కింద ఖనిజ హక్కులపై పన్ను విధించే శాసనపరమైన సామర్థ్యం పార్లమెంటుకు లేదు, ఇది జనరల్ ఎంట్రీ . మినరల్ హక్కులపై పన్ను విధించే అధికారం రాష్ట్ర జాబితా IIలోని ఎంట్రీ 50లో పేర్కొనబడినందున, ఆ విషయానికి సంబంధించి పార్లమెంటు తన విశేష అధికారాలను ఉపయోగించలేదు.
బి) గనులు మరియు క్వారీలతో కూడిన భూములపై పన్ను విధించేందుకు రాష్ట్ర జాబితా IIలోని ఎంట్రీ 49తో పాటు ఆర్టికల్ 246 ప్రకారం రాష్ట్ర శాసనసభలు శాసన సామర్థ్యాలను కలిగి ఉంటాయి. లిస్ట్ IIలోని ఎంట్రీ 50కి సంబంధించి ఖనిజాభివృద్ధికి సంబంధించిన చట్టంలో పార్లమెంటు విధించిన “పరిమితులు” లిస్ట్ లోని ఎంట్రీ 49పై పనిచేయవు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ ప్రభావానికి ఎటువంటి నిర్దిష్ట నిబంధన లేదు.
వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇవ్వండి!
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత కొన్ని రాష్ట్రాలు గనులు, ఖనిజాలపై 1989 నుంచి విధించిన రాయల్టీ సొమ్మును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బుధవారం వ్యతిరేకించింది. ఒక్క ప్రభుత్వరంగ కంపెనీలే 70 వేల కోట్లను తిరిగి చెల్లించాల్సి వస్తుందని, దానివల్ల వాటి ఖజానా ఖాళీ అయి పౌరుల నుంచి ఆ సొమ్మును అధిక ధరల రూపంలో వసూలు చేసుకోవాల్సి వస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరించి 2005 ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్రం, గనుల కంపెనీలు వసూలు చేసిన రాయల్టీని తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆగస్టు 14వ తేదీన స్పష్టం చేసింది. రాయల్టీ బకాయిలు రెండు లక్షల కోట్ల రూపాయలకు మించి ఉండొచ్చని అంచనా. వచ్చే 12 ఏళ్లలో దశలవారీగా కేంద్రం,గనుల కంపెనీలు రాష్ట్రాలకు బకాయిలు చెల్లించవచ్చని ధర్మాసనం పేర్కొంది. బకాయిలు చెల్లింపు పై ఎటువంటి అపరాధ రుసుమును విధించరాదని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు అమలులోకి వస్తే , ఆర్థిక వనరులు లేక, అప్పులు దొరకక, పన్నులు వేయలేక దిక్కు తోచని స్థితి ఉన్నటువంటి రాష్ట్రాలకు కొంత ఉపశమనం కలుగుతుంది.
అయితే కోర్టు విచారణలో పెట్రోల్ , గ్యాస్ గురించి లేకపోవడం విచారకరం!
అయితే కోర్టు విచారణలో ఆయిల్ ఫీల్డ్స్, మినరల్ ఆయిల్ రిసోర్సెస్, పెట్రోల్ , మరియు పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి లేకపోవడం విచారకరం. 438 మంది పిటిషన్ దారులు గాని, ప్రభుత్వం గానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి అడగనందువలన సుప్రీం కోర్ట్ విచారణలో లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో 6 వ పేరాలో తెలియజేసింది. ఇనుప ఖనిజం, బొగ్గు, మైకా,బాక్సైట్, గ్రానైట్, వజ్రాలు, బంగారం, వెండి , మాంగనీస్, బాక్సైట్ , యురేనియం, ధోరియం లాంటివే కాకుండా భూమిలో లభించేటటువంటి శిలాజ ఇంధనాలు అంటే చమురు, సహజవాయువులను అన్ని దేశాలలో ఖనిజ సంపదగా పరిగణిస్తారు. ఖనిజ సంపదను ఆర్గానిక్, ఇనార్గానిక్ గా విభజించారు. ఆయిల్ ఫీల్డ్స్, మినరల్ ఆయిల్ రిసోర్సెస్, పెట్రోల్ , గ్యాస్ లను ఆర్గానిక్ సంపద గా పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు గనులు లాంటి నిక్షేపాలు గల రాష్ట్రాలు ఆర్ధికంగా వెనుకబడిన రాష్ట్రాలుగా తక్కువ ఆదాయంతో ఉన్నాయి. సహజ వనరులు బాగా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్న రష్యా, అమెరికా,ఇరాన్, సౌదీ దేశాలు సంపద్వంతంగావున్నాయి. మనకు గ్యాస్, ఆయిల్ దండిగావున్నా మన రాష్ట్ర సంపద పెరగలేదు. అంబానీ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. రాష్ట్రంలో లభించే ఖనిజ సంపదలన్నిటిపైనా ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గమైన అంబానీ లాంటి వారి ఆదిపత్యం కొనసాగుతున్నది.
ఒకవైపు బంగారపు సింహాసనాలు మరోవైపు రైతుల ఆత్మహత్యలు!
సహజ వనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో50 శాతం కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను పెడచెవిన పెట్టింది. 50 శాతం వాటా ఇవ్వలేదు. పన్ను విధించే హక్కు లేదన్నారు. కష్టాలు మనకి సంపద కార్పోరేట్ కంపెనీలకు వెళుతుంది. భూమి లోపల కొన్ని లక్షల సంవత్సరాల పరిణామాల ఫలితంగా ఖనిజాలు,సహజవాయువు, చమురు ఏర్పడుతుంది. అటువంటి విలువైన ఖనిజ సంపదను కొద్దిమంది ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికి కట్టపెట్తున్నారు. ప్రజల సొత్తైన ఖనిజ సంపదను కొట్టేసి, బంగారపు సింహాసనాలపై కూర్చొని ప్రజలపై అధికారాలను చెలాయిస్తూ, దేవతా విగ్రహానికి బంగారు కిరీటాలు సమర్పిస్తూ కులుకుతున్నారు. ప్రపంచ ధనవంతుల లిస్టులో ప్రధమ స్థానం కోసం పోటీ పడుతున్నారు. వేలకోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మరోవైపు తాళిబొట్టు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతుల ఆత్మహత్యల నివారణకు సహజ వనరులను ఉపయోగించాలనే కనీస బాధ్యత పాలకులకు లేనందున ప్రజలు కష్టాలను ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. ఖనిజాలు భూమి నుండి వెలికి తీసిన ఫలితంగా భూమిలో, పర్యావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. భూగర్భ జలాలు, చెరువులు, బావులు, గాలి కలుషితమయి, వాతావరణ దుష్పరిణామాలవలన కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు, గుండెజబ్బులు,కేన్సర్ బారిన పడ్డ ప్రజలు కనీస వైద్య సదుపాయాలు లేక నరకాన్ని అనుభవిస్తున్నారు. అపారమైన సహజ సంపదను బడా కార్పోరేట్ కంపెనీలకు అప్పచెప్పి ఆదివాసీలను గాలికి వదిలేశారు. సహజ సంపదను కాపాడుతున్న ఆదివాసీలకు కనీస జీవన సౌకర్యాలను కలగచేయటంలో విఫలం చెందారు .ఆదివాసీల అభ్యున్నతికి చట్టాలు ఎన్నో వున్నాయి. ఆచరణలో ఈ చట్టాలు కార్పొరేట్ కంపెనీలకే ఉపయోగపడుతున్నాయి.
కోర్టు తీర్పుల అమలు ప్రజా ఉద్యమ శక్తి పై ఆధారపడి వుంటుంది..
అయితే చట్టాలు వేరు, కోర్టులు తీర్పులు వేరు. వాటి అమలు చేయటం ప్రజల పైన ప్రజా ఉద్యమాల తీవ్రత, బలాబలాల పొందిక పైన ఆధారపడి ఉంటుందనే విషయం అందరికీ అనుభవమే. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలే భూసంస్కరణల ను అమలు పరచుకొని భూమిని పంచుకున్నారు. ప్రజా ఉద్యమాలకు భయపడి కౌలు దారి చట్టం, భూసంస్కరణల చట్టాలను తెచ్చారు. ప్రజా ఉద్యమాల తీవ్రత తగ్గుతూ వస్తున్న కాలంలో చట్టాలను అమలు పరచలేదు. శ్రీకాకుళం రైతాంగ పోరాటం తరువాత మరోసారి భూసమస్య ముందుకు వచ్చింది. భూసంస్కరణల చట్టాలను అమలు పరచమని కొల్లావెంకయ్యగారి పిటీషన్ పై మిగులు భూములను పేదప్రజల కు పంచమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ భూస్వామ్యవర్గ ప్రభుత్వాలు ఆ తీర్పును ఇప్పటివరకు అమలు పరిచ లేదు. భూసమస్య ఇంతవరకూ పరిష్కరింపబడలేదు. స్వామినాథన్ వ్యవసాయ కమిషన్ 2006 లో విస్పష్టంగా భూసమస్యను పరిష్కరించమని మొదటి రికమండేషన్ గా చెప్పినా అమలు పరచలేదు. భూసేకరణ చట్టం 2013 ను ఆచరణలో నిర్వీర్యంచేసి కార్పోరేట్ కంపెనీలకు భూమిని అప్పచెప్తున్నారు. అభివృద్ధి పేరున భూములను గుంజు కుంటున్నారు. భూసంస్కరణల చట్టాలను అమలు పరచమనే ఉద్యమాలకు శక్తి చాలటం లేదు. భూసంస్కరణల కోసం పోరాడే పరిస్థితి ఈనాడు లేదు. కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నారు. ఈ రాజ్య వ్యవస్థ లో ప్రజానుకూల మైన చట్టాలు తీర్పులు రావటమే అరుదు. ఒక చిన్న అవకాశం దొరికినా ప్రజా ఉద్యమాల పురోగతికి ఉపయోగపెట్టుకోవటం అవసరం. వ్యవస్థ మార్పు తోనే ముఖ్య సమస్యలు పరిష్కారం సాధ్యమనే అవగాహనతో చట్టాలను అమలు పరచమని ఆందోళనలు జరుగుతున్నాయి. నామమాత్రపు తీర్పులైనా విశాల ప్రజానీకానికి ఉపయోగమనుకుంటే ప్రజలలో ప్రచారం చేయాలి. అమలు చేయమని నిలదీయాలి. సానుకూల మైన అంశాలను ప్రజలకు తెలియ చేయాలి. ఎపుడో నూటికి కోటికి వచ్చే ప్రజానుకూల మైన తీర్పులను గమనంలోకి తీసుకుంటూనే ప్రభుత్వాధినేతల స్వార్ధాన్ని బహిరంగపరచాలి. క్రోనీ కేపటలిజం అమలును అంబానీ, అదానీల వైపు ప్రభుత్వం పక్షపాతాన్ని , అధికార కేంద్రీకరణ ను ఇటువంటి తీర్పుల ఉదాహరణలతో ప్రజలను చైతన్య పరచాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలపై పెత్తనాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు తరతమ బేధం తో తమ అసంతృప్తిని తెలియచేస్తున్నాయి. ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష, ఒకే ఎన్నిక, డబల్ ఇంజన్ సర్కార్, అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజల పై భారం పెంచుతుంది. మరొకపక్క క్రోనీ కేపిటలిజానికి ప్రతినిధులుగా వున్న అంబానీ, అదానీలకు సంపదను కట్టపెట్తున్నారు. వారిని ఎదుర్కొనటానికి లభించిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి.ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా అమలు పరుస్తాయా? కార్పోరేట్ కంపెనీల కు అనుకూలంగా వ్యవహరిస్తాయా? అనేది ప్రజా ఉద్యమాల తీవ్రత పై ఆధారపడి ఉంటుంది.
ఈ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు సహజవనరుల పై పన్ను విధించితే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది . రాష్ట్ర ప్రజల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం వుండదు. కేజీ బేసిన్ లో లభ్యమయ్యే గ్యాస్, ఆయిల్ తో సహా, సహజ వనరులన్పనిటిపైనా పన్ను విధించే రాజ్యాంగ పరమయిన హక్కు మనకున్నదని చెప్పాలి. అందుకు జులై 25 సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇతర ఖనిజాలతో పాటు గ్యాస్, చమురును చేర్చాలని సుప్రీంకోర్టులో లీగల్ పోరాటం చేయాలి. ఖనిజ వనరులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్ను విధించాలి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పార్టీలకు అతీతంగా అన్ని వామపక్ష విప్లవ పార్టీలు, వివిధ రంగాల ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు సమైక్యంగా ముందుకు కదలాల్సిన తరుణం ఆసన్నమయింది. ప్రజలకు దక్కాల్సిన సహజ వనరులపై హక్కులపై ఆదిపత్యం చలాయిస్తున్న అంబానీ, అదానీలాంటి ఆశ్రిత పెట్టుబడిదారీవర్గంపై ప్రజాఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు సాగుదాం! చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో సమైక్య ఉద్యమాన్ని నిర్మించాలి!