HomeEditorialEditorial : శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో రికార్డులను తిరగరాసిన వామపక్షం !

Editorial : శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో రికార్డులను తిరగరాసిన వామపక్షం !

Published on

spot_img

– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.

సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా వామపక్ష నేత అనుర కుమార దిశనాయకే విజయం ఒక పెద్ద మలుపు.నవంబరు 14న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గత అనేక రికార్డులను బద్దలు కొట్టి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) మూడిరట రెండువంతుల మెజారిటీతో 225కు గాను 159 సాధించి లంక చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.ఈ పార్టీకి గరిష్టంగా 130 స్థానాలు వస్తాయని ఎన్నికల పండితులు అంచనాలు వేశారు. జనతా విముక్తి పెరుమన(సంఘటన), దానితో పాటు మరో 27 వామపక్ష పార్టీలు, సంస్థలు, ప్రజాసంఘాలు కలసి నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌(ఎన్‌పిపి) పేరుతో ఒక కూటమిగా పోటీ చేశాయి. అన్నింటికంటే ముఖ్య అంశం తమిళ, ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీ చొచ్చుకుపోవటం ఎవరూ ఊహించని పరిణామం. సోమవారం నాడు కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. లంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని నూతన ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తుండగా వామపక్ష ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆశలు, విశ్వాసం ప్రజల్లో వ్యక్తమైంది. గత ప్రభుత్వం ఐఎంఎఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు ప్రజలలో వ్యతిరేకతను పెంచటం కూడా ఎన్‌పిపి విజయానికి దోహదం చేసిందని చెప్పవచ్చు.

అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమారకు 42.3శాతం ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికల్లో 61.68శాతం వచ్చాయి. 2010 ఎన్నికల్లో మహింద రాజపక్సే పార్టీకి 60.33శాతమే ఇప్పటి వరకు రికార్డు. అదే విధంగా పార్లమెంటులో 2020ఎన్నికల్లో అదే పార్టీకి 145 సీట్ల రికార్డును 159తో ఎన్‌పిపి బద్దలు కొట్టింది.ఇరవై రెండు జిల్లాలకు గాను 2010రాజపక్స 19చోట్ల ఎక్కువ సీట్లు సంపాదించగా ఈసారి ఎన్‌పిపి 21 జిల్లాల్లో మెజారిటీ సాధించింది. తమిళులు మెజారిటీగా ఉన్న బట్టికలోవాలో మాత్రమే రెండవ స్థానంలో ఉంది. వీటన్నింటిని చూసినపుడు కేవలం మెజారిటీ సింహళీయుల, మైనారిటీ వ్యతిరేకుల పార్టీ అన్న ముద్రను ఎన్‌పిపి పోగొట్టుకుంది. ఇది ఎలా జరిగింది, కారణాలేమిటి అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. జాతుల పరంగా మెజారిటీ, మైనారీటీ సామాజిక తరగతుల ఛాంపియన్లుగా తరతరాలుగా ముద్ర పడిన పార్టీల మీద జనం విశ్వాసం కోల్పోవటమే దీనికి ప్రధాన కారణం. కరోనాకు ముందు దీర్ఘకాలం ఉన్న ఉగ్రవాద సమస్య, తరువాత తలెత్తిన ఆర్థిక సంక్షోభాలతో అందరూ దెబ్బతిన్నారు. దుర్భరపరిస్థితుల నుంచి సాంప్రదాయ పార్టీలేవీ గట్టెంకించలేవన్న భావన ఓటర్లలో బలంగా తలెత్తింది. అధ్యక్ష ఎన్నికల తరువాత ఎస్‌జెపి అనురకుమారను వ్యతిరేకించేశక్తులు చేతులు కలిపితే పార్లమెంటులో మెజారిటీ సాధిస్తారని వేసిన అంచనాలన్నీ తప్పాయి. లంక రాజ్యాంగం ప్రకారం 225 స్థానాలలో 196 మందిని నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నుకుంటారు.మరో 29 స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం వాటికి సీట్లు కేటాయిస్తారు. ఎన్‌పిపి 141నియోజవర్గాల్లో గెలవగా దామాషా ఓట్లతో 18 స్వంతం చేసుకుంది. 2020 ఎన్నికలలో ఎన్‌పిపికి కేవలం మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి.

ఐదు సంవత్సరాల క్రితం కేవలం 3.16శాతం ఓట్లు తెచ్చుకున్న వామపక్ష నేత 42.3శాతం ఓట్లతో ప్రధమ స్థానంలో నిలవటం, రెండవ ప్రాధాన్యతా ఓట్లలెక్కింపులో 55.89శాతం ఓట్లతో విజయం సాధించటం తెలిసిందే.ఆ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ ఎస్‌జెపి అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస 32.76శాతం, అధ్యక్షుడు రానిల్‌ విక్రమ సింఘే(ఎన్‌డిఎఫ్‌) స్వతంత్ర అభ్యర్ధిగా 17.27శాతం ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మిగిలిన ఓట్లను 35 మంది ఇతర అభ్యర్థులు తెచ్చుకున్నారు. అక్కడి విధానం ప్రకారం అధ్యక్షపదవికి ఎందరైనా పోటీ పడవచ్చు. ప్రతి ఓటరూ ముగ్గురికి ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయవచ్చు.నిబంధన ప్రకారం 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారినే విజేతగా ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో మొదటి ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని పోటీ నుంచి తొలగిస్తారు. వారికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యతా ఓట్లు ఎవరికి ఉంటాయో వారికి కలిపి 50శాతంపైగా తెచ్చుకున్నవారిని విజేతగా నిర్ధారిస్తారు. ఆ ప్రకారం వామపక్ష నేతకు 55.89 శాతం వచ్చాయి. శ్రీలంక నూతన రాజ్యాంగం ప్రకారం 1982 తరువాత జరిగిన ఎన్నికలన్నింటిలో గెలిచిన వారందరూ మొదటి రౌండులోనే 50శాతంపైగా సంపాదించుకొని గెలిచారు. తొలిసారిగా రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణనలోకి తీసుకొని విజేతను నిర్ణయించారు. ముందే చెప్పుకున్నట్లు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొత్త రికార్డులు నమోదయ్యాయి. వామపక్ష ఎన్‌పిపికి వ్యతిరేకంగా సాజిత్‌ ప్రేమదాస, రానిల్‌ విక్రమసింఘే తమ విబేధాలను పక్కన పెట్టి ఒకే అభ్యర్థిని నిలిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.

అధ్యక్ష ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు కలిపి 50శాతంపైగా ఓట్లు వచ్చాయి. అదే పార్లమెంటు ఎన్నికలలో ఎస్‌జెపికి 17.66. ఎన్‌డిఎఫ్‌కు 4.49శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. ఎస్‌జెపికి అంతకు ముందు 54 సీట్లు ఉండగా ఈ సారి 40కి తగ్గాయి. ఎన్‌డిఎఫ్‌కు కొత్తగా ఐదు సీట్లు వచ్చాయి. తిరుగులేని సోదరులుగా పేరుతెచ్చుకొని, అత్యంత హీన చరిత్రను మూటగట్టుకున్న శ్రీలంక పొడుజన పెరుమన(ఎస్‌ఎల్‌పిపి)కి గత ఎన్నికల్లో 59శాతం ఓట్లు తెచ్చుకోగా తాజా ఎన్నికల్లో 2.57శాతం మాత్రమే తెచ్చుకొని పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అదే పార్లమెంటు ఎన్నికల్లో 3.14శాతం ఓట్లతో 145లో 142 పోగొట్టుకొని కేవలం మూడు సీట్లు మాత్రమే తెచ్చుకుంది. శ్రీలంక 74 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో 38 ఏండ్ల పాటు అధికారంలో ఉండి చరిత్ర సృష్టించిన యుఎన్‌పి 0.59శాతం ఓట్లు తెచ్చుకొని ఒక్క సీటుకు పరిమితమైంది.అనూహ్యమైన అనుర కుమార విజయం తరువాత ఎన్‌పిపిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనతా విముక్తి పెరుమన(జెవిపి) వైఖరిలో వచ్చిన మార్పు లేదా ఎత్తుగడల్లో భాగంగా అన్ని సామాజిక తరగుతులకు అది దగ్గరైంది. వారి విశ్వాసాన్ని చూరగొంది. అధ్యక్ష`పార్లమెంటు ఎన్నికల మధ్య ఉన్న రెండునెలల వ్యవధిని అది ఉపయోగించుకుంది.తమిళులు, ముస్లింలు గణనీయంగా ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంతాలలో ఆ సామాజిక తరగతులకు చెందిన వారినే అభ్యర్థులుగా నిలిపారు. ఆ స్థానాల్లో అంతకు ముందు పాతుకుపోయిన నేతలందరినీ చిత్తుచిత్తుగా ఓడిరచారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇలంకాయ్‌ తమిళ అరసు కచ్చి(ఐటిఎకె) పార్టీ 1949 నుంచి పని చేస్తున్నది. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నా జిల్లాలోని నాలుగు సీట్లలో దీనికి ఒక సీటు రాగా ఎన్‌పిపి మూడు తెచ్చుకుంది. ఇలాంటిదే మరో జిల్లా బట్టికలోవాలో ఎన్‌పిపికి ఒకటి, ఐటిఏకి మూడు వచ్చాయి. ఇక్కడ మాత్రమే ఎన్‌పిపి వెనుకబడిరది. పార్లమెంటు ఎన్నికల్లో 2.31శాతం ఓట్లు, ఎనిమిది సీట్లతో మూడవ స్థానంలో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో తమిళులు ఉండే ప్రాంతాలలో కేవలం పదిశాతం అంతకంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న ఎన్‌పిపి పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 25 నుంచి 42శాతం వరకు పెంచుకుంది.

ఎన్‌పిపికి తిరుగులేని మెజారిటీ వచ్చిన కారణంగా అనేక పార్టీల మాదిరి అది కూడా నిరంకుశంగా వ్యవహరిస్తుందా అన్న చర్చను కూడా కొందరు లేవనెత్తుతున్నారు. లంక అధ్యక్షుడికి కార్యనిర్వాహక అధికారాలు ఉన్న కారణంగా గత పాలకులు అడ్డగోలుగా వ్యవహరించారు. దానికి పార్లమెంటులో మెజారిటీ కూడా తోడైంది. ఈ కారణంగానే అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటంతో తలెత్తిన నిరసనకారణంగా అధ్యక్ష భవనంపై దాడితో మిలిటరీ రక్షణతో దేశం వదలి పారిపోవాల్సి వచ్చింది. నూతన రాజ్యాంగాన్ని తీసుకువచ్చి అధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను తొలగిస్తామని గతంలో వాగ్దానం చేసిన పార్టీలేవీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఎన్‌పిపి కూడా అదే వాగ్దానం చేసింది.ఇది కూడా కొత్త రాజ్యాంగాన్ని తెస్తుందా , ఇతర పార్టీల బాటలోనే ఉన్నదాన్నే కొనసాగిస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి.లాటిన్‌ అమెరికాలో వామపక్షాలు అధ్యక్ష, ప్రధాని పదవులు పొందుతున్నప్పటికీ పార్లమెంట్లలో మెజారిటీ తెచ్చుకోలేని కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు లంకలో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా స్పష్టమైన తీర్పు వచ్చింది. అందువలన ఎన్‌పిపి తన అజెండాను అమలు జరిపేందుకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. లాటిన్‌ అమెరికా వామపక్షాల మాదిరే ఉన్న వ్యవస్థపునాదుల మీదనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందా లేక వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.2022లో అధికారానికి వచ్చిన ప్రభుత్వం ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల షరతులన్నింటికీ తలవూపి రుణాలు తీసుకుంది. దాని వలన పౌర సంక్షేమానికి నిధుల కోత ఒకటైతే భారాలు మరొకటి. ఐఎంఎఫ్‌ ఒప్పందాల నుంచి తక్షణమే వైదొలిగితే మరోసారి లంక చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. దాని షరతుల నుంచి ఉపశమనం కలిగించకపోతే జనంలో అసంతృప్త్తి తలెత్తటం అనివార్యం.

ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ షరతులను ఒకవైపు అమలు జరుపుతూ మరోవైపు సంక్షేమ చర్యలను కొనసాగించిన దేశాలు దాదాపు లేవు. ఐఎంఎఫ్‌ షరతుల నుంచి పేదలను రక్షిస్తానని అధ్యక్షుడు దిశనాయకే ప్రకటించినప్పటికీ నిలబెట్టుకుంటారా అన్నది ప్రశ్న. గత ప్రభుత్వం అంగీకరించిన మేరకు నాలుగు వందల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం లేదా పునర్‌వ్యవస్తీకరించాలి.ఏది జరిగినా లక్షల ఉద్యోగాలు పోతాయి.పౌరుల మీద పన్నులు పెంచాలి, ఉచిత విద్య, వైద్యం వంటి సేవల నుంచి ప్రభుత్వం వైదొలగాలి లేదా గణనీయంగా వాటి ఖర్చుకోత పెట్టాలి. మరోవైపు విదేశాంగ విధానం ఒక సవాలుగా మారనుంది. ఇప్పటి వరకు చైనా అనుకూల దేశంగా లంకకు ముద్రపడిరది. దాన్నుంచి తన ప్రభావంలోకి తెచ్చుకొనేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందన్నది ఒక అభిప్రాయం. గత ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడితో అదానీ కంపెనీకి ఇచ్చిన విద్యుత్‌ ప్రాజెక్టును రద్దు చేస్తామని కూడా దిశనాయకే ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. అదే జరిగితే మనదేశ పెట్టుబడిదారులు అక్కడ పెట్టుబడులకు ముందుకు వెళ్లరు. మరోవైపు హిందూమహా సముద్రం మీద పట్టుకోసం అమెరికా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది.

Latest articles

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...

Editorial : బక్కచిక్కుతున్న రూపాయి పాపాయి జనంపై మోయలేని భారం : పదేండ్లుగా పల్తెత్తు మాట్లాడని నరేంద్రమోడీ !!

- ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్. మన జనానికి నిజంగానే మతిమరపు ఎక్కువా లేదా పట్టించుకోవట్లేదా ? కోరి చేసుకున్నోడు గనుక...

More like this

Earthquake: ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్ప భూకంపం

ప్రకాశం జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం సంభవించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో నిన్న (శనివారం)...

సహకార ఉద్యమంలో రాజీలేని పోరుసాగించిన యోధుడు మానం ఆంజనేయులు

* అభినందన సభలో ప్రముఖుల ఉద్ఘాటన హైదరాబాద్ : సహకార ఉద్యమంతో పాటు అనేక కార్మిక పోరాటాల్లో ఎన్నో నిర్భంధాలు,...

Telangana: అరగంటకు పైగా నిలిచిపోయిన రైళ్లు..

హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే వందేభారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు పలు రైళ్లు...