నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ,ఎస్టీ కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
తమ కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నందుకు మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబరు 14న సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి 8 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేశారు. సుమారు ఐదేళ్ల పైగా కోర్టులో విచారణ కొనసాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తుది తీర్పును వెల్లడించింది.
ప్రణయ్ హత్య కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్మకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఏ2 సుభాష్ కుమార్ శర్మ, ఏ3 అస్గర్ అలీ, ఏ4 అబ్దుల్ భారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 శ్రవణ్ కుమార్ (మారుతీరావు సోదరుడు), ఏ7 సుముద్రాల శివ, ఏ8 నిజాం (ఆటో డ్రైవర్) నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ కుమార్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైలులోనే ఉండగా.. అస్గర్ అలీ వేరే కేసులో జైల్లోనే ఉన్నాడు. మిగిలి వారంతా బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడటంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.