పిల్లలు ఎలా చదువుతున్నారు….? వారికి ఏ సబ్జెక్టు ఏ టీచర్ బోధిస్తున్నారు…? పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి…? తదితర వివరాలన్నిఒక్క క్లిక్ తో తల్లిదండ్రులు తెలుసుకునేలా …పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటీ నుంచి నూతన విద్యావిధానంలో
సరికొత్త చర్యలకు శ్రీకారం చుడుతుంది. అర చేతిలోనే సమస్త సమాచారం అందించేలా యాప్‌ను రూపొందిస్తోంది. పిల్లల అపార్ నంబరుతో లాగిన్ అయితే చాలు ఆ పాఠశాల సమస్త సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఒకే పాఠశాల- ఒకే యాప్… విధానంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనికి శ్రీకారం చుట్టారు. ఈ యాప్‌తోపాటు ప్రజలందరూ బడుల పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును తీసుకొస్తున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు యాప్ లాగిన్ ఇస్తారు. పిల్లల హాజరు, పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు, బడిలో చేసిన ఆరోగ్య పరీక్షల నివేదికలు పరిశీలించవచ్చు. పాఠశాలలోని గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఐఎఫ్‌పీ ప్యానళ్లు, స్మార్ట్‌టీవీలు ఇలా సమస్త సమాచారం ఫోన్‌లోనే చూసుకోవచ్చు.