HomeEditorialEditorial : ఎర్రపూల వనం : మావో లిటిల్‌ రెడ్‌ బుక్‌ అట్ట రంగు నీలం...

Editorial : ఎర్రపూల వనం : మావో లిటిల్‌ రెడ్‌ బుక్‌ అట్ట రంగు నీలం ! అయితేనేం, అంశాలు కమ్యూనిజమే కదా !!

Published on

spot_img

– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.

పిల్లి నల్లదా తెల్లదా అన్నది కాదు, అది ఎలుకల్ని వేటాడుతుందా లేదా అన్నదే చూడాలన్నది ఒక చైనా సామెత. కమ్యూనిస్టులు ముద్రించే సాహిత్యం అంటే ఎర్రటి అట్టలుంటాయని చాలా మంది అనుకుంటారు, అది పాక్షికంగా వాస్తవం కూడా. పోలీసులు నక్సలైట్లను బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేసినపుడు వారి దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన వస్తువుల్లో ఎర్ర అట్టలతో ముద్రించిన పుస్తకాలను కూడా చూపేవారు. నిజానికి ఎర్ర అట్టలతో పుస్తకాలు ముద్రించిన వారిలో ఎందరు చివరి వరకూ కమ్యూనిస్టులుగా ఉన్నారు ? గాడి తప్పి జెండాను పక్కన పడేయటం, ఉద్యమాన్ని నాశనం చేయటం, ద్రోహం చేసిన వారి చరిత్రలు తెలిసినవే. సాంస్కృతిక విప్లవం పేరుతో అమలు జరిపిన కార్యక్రమానికి ముందు మావో జెడాంగ్‌ ఆలోచనలతో కూర్చిన ఒక పుస్తకాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ 1964లో ప్రచురించింది. దాన్నే లిటిల్‌ రెడ్‌ బుక్‌ అని పిలిచారు. ఆ పుస్తకపు తొలి ముద్రణ అట్ట నీలి రంగులో ఉంది.తరువాత అది ఎర్ర అట్టతో వందకోట్లకు పైగా ముద్రణలు పొందిందని చెబుతారు. తొలి నీలి రంగు ప్రతి అరుదైనదిగా మారింది. ఈ ప్రతిని ఏప్రిల్‌లో న్యూయార్క్‌లో జరిగే అంతర్జాతీయ ప్రాచీన పుస్తక ప్రదర్శనలో ప్రదర్శించటమే గాక వేలంలో దాని ధరగా పదిలక్షల పౌండ్లు నిర్ణయించారు. విప్లవంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ పాత్ర గురించి మావో చెప్పిన అంశాలతో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. 1964 ముద్రణకు ముందు చైనా ప్రజా విముక్తి సైన్యాన్ని ఉద్దేశించి మావో చెప్పిన అంశాలతో సంకలనం జరిగింది. తరువాత అనేక మార్పులు, చేర్పులతో మరింత స్పష్టత,క్లుప్తతతో రూపొందించారు. ఈ పుస్తక ముద్రణ తరువాత 1966లో వివాదాస్పద సాంస్కృతిక విప్లవ కార్యక్రమాన్ని అమలు చేశారు. అప్పుడు ఎర్ర అట్టతో మరోసారి మార్పులు చేసిన ఈ గ్రంధం అనేక ముద్రణలు పొందింది. జస్టిన్‌ ష్కిల్లర్‌ అనే అమెరికన్‌ రెండు దశాబ్దాలకు పైగా వివిధ దేశాల నుంచి అపురూప పుస్తకాలను సేకరించాడు. 1990 దశకం ప్రారంభంలో ష్కిల్లర్‌ చైనా వెళ్లాడు. ఆ సమయానికి 1963నాటి ముద్రణ ప్రతులను సంస్థలు, వ్యక్తులు పక్కన పడేశారని ఆ తరుణంలో ఆ ప్రతిని సంపాదించినట్లు పుస్తకాల అమ్మకాలను పర్యవేక్షిస్తున్న లండన్‌కు చెందిన అపురూప పుస్తకాల డీలర్‌ మాట్‌ విల్స్‌ చెప్పాడు. ఈ ప్రదర్శన`అమ్మకంలో అనేక తొలి , అంతర్జాతీయ ముద్రణల అపురూప ప్రతులను ప్రదర్శిస్తారు.

మావో ఆలోచనా విధానంలో కొన్ని అంశాలను తరువాత చైనా కమ్యూనిస్టు పార్టీ పక్కన పెట్టినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పాత్ర, విప్లవ అనుభవాల గురించి మావో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ చైనా కమ్యూనిస్టులకు, అంతర్జాతీయంగా మార్గదర్శకంగానే ఉన్నాయి. మరణానంతరం మావో పాత్రను తగ్గించటం లేదా విస్మరించటం వంటి తప్పిదాలకు కమ్యూనిస్టు పార్టీ పాల్పడలేదు.ప్రతి ఒక్కరూ ధనవంతులౌతారని ఊహించుకోవటానికే భయం వేస్తున్నదని ఆ పుస్తకంలో ఒక సందర్భంగా మావో చెప్పారు. ఆరుదశాబ్దాల తరువాత చైనా ఆ దిశగా ప్రయాణిస్తుందని, అసాధ్యం అనుకున్నదానిని తాను మార్గదర్శకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ సుసాధ్యం చేసే బాటలో పయనిస్తుందని మావో ఊహించి ఉండరు. లిటిల్‌ రెడ్‌ బుక్‌ ప్రతిని ఎవరు స్వంతం చేసుకుంటారో, విక్రేతలు ఆశిస్తున్నట్లుగా పదిలక్షల పౌండ్లకా తక్కువ ఎక్కువలకు అమ్ముడు పోతుందా అన్నది వేరే అంశం. మావో జీవితాంతం వ్యతిరేకించిన ధనికస్వామ్యపు ప్రతినిధులు, భాగస్వాములే దాన్ని సొంతం చేసుకుంటారు. వారికి అది ఒక అలంకరణ వస్తువు మాత్రమే. కమ్యూనిస్టులు, కష్ట జీవులు అంత ధరకు కొనుగోలు చేయరు గానీ దానిలో ఉన్న అంశాలను మాత్రం సొంతం చేసుకుంటారు, ఆచరించేందుకు చూస్తారు, భవిష్యత్‌ తరాలకు అందిస్తారు.

సైప్రస్‌లో మరో కమ్యూనిస్టు పార్టీ !

ప్రాణం ఉన్నంత వరకు జీవి బతుకుపోరాటం చేస్తూనే ఉంటుంది. అలాగే సజీవంగా ఉన్న ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో నిరంతరం మధనం జరుగుతూనే ఉంటుంది. సైప్రస్‌లో కొందరు 2024 సైప్రస్‌ కమ్యూనిస్టు ఇనీషియేటివ్‌(సిసిఐ) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. సైప్రస్‌ కమ్యూనిస్టు పార్టీ అకెల్‌(ప్రోగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ వర్కింగ్‌ పీపుల్‌) కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు క్రిస్టోస్‌ కౌర్టెల్లారిస్‌ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. క్రిస్టోస్‌ తాత అకెల్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. తాము ఎన్నికల్లో పాల్గ్గొనటం కంటే సంస్థాగతంగా పటిష్టం కావటానికి ప్రాధాన్యత ఇస్తామని, కమ్యూనిస్టు పార్టీ లేని లోటును పూడుస్తామని తాజాగా ఆ పార్టీనేత ఒకరు చెప్పారు.అకెల్‌ పార్టీ సైప్రస్‌ పార్లమెంటులోని 56 స్థానాలకు గాను 15 సీట్లతో, 21శాతం ఓట్లతో రెండవ స్థానంలో ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని సిసిఐ చెప్పుకుంది.

దక్షిణ కొరియాలో కమ్యూనిస్టు వ్యతిరేకత`క్రైస్తవ సువార్తకులు !

దక్షిణ కొరియాలో సైనిక పాలన ప్రకటించి తీవ్ర వ్యతిరేకత వెల్లడి కావటంతో కొద్ది గంటల్లోనే రద్దు చేసిన అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మీద కోర్టు తీర్పు వెలువడనుండగా అతగాడికి మద్దతుగా, వ్యతిరేకంగా శనివారం నాడు లక్షల మంది రాజధాని సియోల్‌ పట్టణంలో ప్రదర్శనలు జరిపారు. వ్యతిరేకంగా పదిలక్షల మంది, అనుకూలంగా మూడున్నరలక్షల మంది పాల్గ్గొన్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కమ్యూనిస్టు ముప్పు నుంచి తప్పించేందుకే తాను మిలిటరీ పాలన విధించానని యూన్‌ సమర్ధించుకున్నప్పటికీ గద్దె దిగాల్సిందేనని పార్లమెంటు గతేడాది డిసెంబరులో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది, దాన్ని ధిక్కరించటంతో అరెస్టు కూడా చేశారు. మార్చినెల ఏడవ తేదీన అరెస్టు వారంటును కోర్టు రద్దు చేయటంతో జైలు నుంచి విడుదల చేశారు, యూన్‌ పార్లమెంటు చర్యను కోర్టులో సవాలు చేశాడు. అక్కడి చట్ట ప్రకారం తిరుగుబాటు చేసిన వారికి ఉరిశిక్ష, జీవిత ఖైదు విధించవచ్చు, తప్పుచేయలేదంటే అధ్యక్షుడు గనుక తిరిగి పదవిలో కూర్చో పెట్టవచ్చు. తీర్పు సమయం దగ్గరపడిన కొద్దీ దేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాలు సమీకరణలకు పూనుకున్నాయి. యూన్‌ తరఫున అక్కడి క్రైస్తవ ఇవాంజెలికల్స్‌ రంగంలోకి దిగారు. తమ అధ్యక్షుడిని తిరిగి గద్దె మీద ప్రతిష్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు.దేశమంతటా ఈ మేరకు ప్రదర్శనలు చేస్తూ కమ్యూనిజం ముప్పు ఉన్నందున రక్షకుడిగా యూన్‌ ఉండాల్సిందేనంటూ ఉపన్యాసాలు చేస్తున్నారు.దేవుడు రచించిన మంచి పధకంలో భాగంగానే యూన్‌ చర్యలు తీసుకున్నాడంటూ బోధలు, ప్రార్ధనలు చేస్తున్నారు. చివరి వరకు పోరాడాల్సిందేనంటూ యూన్‌కు మద్దతు తెలుపుతున్నారు.దేశంలోని క్రైస్తవులు రెండు పక్షాలుగా చీలిపోయారు. మూడిరట రెండు వంతుల మంది సీనియర్‌ పాస్టర్లు యూన్‌ తొలగింపును సమర్ధిస్తున్నట్లు సర్వే వెల్లడిరచింది.అమెరికాలో ఎవాంజెలికల్స్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లే దక్షిణ కొరియాలో కూడా యూన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఉత్తర కొరియా, చైనా ఏజంట్లు, మద్దతుదార్లు దక్షిణ కొరియా ప్రభుత్వంలో చొరబడినట్లు, వారందరినీ రూపుమాపాల్సిందేనని వారు సాధారణ జనాన్ని రెచ్చగొడుతున్నారు.యూన్‌ తిరిగి అధికారానికి రాకపోతే చైనా, ఉత్తర కొరియా అనుకూల పార్లమెంటు సభ్యులు దేశాన్ని చైనాకు సామంత దేశంగా, సోషలిస్టు రాజ్యంగా మార్చుతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 1950దశకంలో ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేసినపుడు దాన్ని పవిత్ర యుద్ధంగా దక్షిణ కొరియాలోని చర్చి వర్ణించి అమెరికాకు మద్దతు పలికింది. ఇటీవలి పరిణామాల గురించి యూట్యూబర్లు పెద్ద ఎత్తున రంగంలోకి కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు, వారి వెనుక ఎవరు ఉన్నదీ అర్ధం చేసుకోవటం కష్టం కాదు.

అమెరికాను వెన్నాడుతున్న చైనా కమ్యూనిస్టు భయం !

కమ్యూనిజాన్ని ఏడు నిలువుల లోతున పాతి పెట్టామని, విజయం సాధించామని మూడు దశాబ్దాల క్రితం ప్రకటించుకున్న అమెరికాను ‘‘ కమ్యూనిస్టు భూతం ’’ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల అమెరికా జాతీయ భద్రతకు చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎలా ముప్పు వచ్చిందో చెప్పాలంటూ పార్లమెంటరీ కమిటీ కొన్ని ప్రశ్నలను సంధించింది. చైనా వాంఛలేమిటి, సైబర్‌, అంతర్గత భద్రతకు దాన్నుంచి ముప్పు ఎలా ఉంది, చైనా వివిధ దేశాల నుంచి ఎలా ముప్పు కలిగిస్తోందో చెప్పాలని కోరింది. దానికి గాను ఆ కమిటీ ముందు వివరించిన అంశాల సారం ఇలా ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయవాదంతో పని చేస్తోంది. సామ్రాజ్యవాదుల చేతిలో దశాబ్దం పాటు పొందిన అవమానాలకు బదులు తీర్చుకోవాలని చూస్తోంది.అమెరికా నాయకత్వంలోని ప్రపంచ వ్యవస్థను అధిగమించాలన్న పెద్ద పథకంతో ఉంది.సాంకేతికంగా, ఆర్థికంగా, మిలిటరీ పరంగా కూడా అధిగమించే, ఓడిరచే సత్తాను సమకూర్చుకోవాలని చూస్తోంది. పశ్చిమార్ధగోళంలో మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది.భూ, సముద్ర, ఆకాశంలో కూడా మిలటరీ రీత్యాపై చేయిగా మారాలనుకుంటున్నది.

అంతర్జాతీయ సంస్థలలో నాయకత్వ పాత్రకోసం,పశ్చిమ దేశాల కూటమిని చీల్చాలని చూస్తోంది. అమెరికా వ్యక్తిగత సమాచారాన్ని పొందటం ద్వారా గూఢచార అవసరాలను తీర్చుకోవాలని, లక్ష కోట్ల మేథోసంపత్తి సంపదను కొట్టేసేందుకు వివిధ కంపెనీలు, అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో చొరబడాలని, ఉన్నత అధికారుల వివరాలను సేకరించాలని, యుద్ధ సమయాలలో గగనతలంలో పోరు సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లకోసం ప్రయత్నిస్తున్నది. చైనా నుంచి పని చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయటాన్ని నిషేధించాలి.అమెరికా వ్యవస్థలు, కంపెనీలు ఎలా పనిచేస్తున్నదీ తెలుసుకొనేందుకు చైనా ప్రయత్నించటాన్ని అనుమతించకూడదు. అమెరికా వ్యవస్థలలో వినియోగించేందుకు చైనా కంపెనీల పరికరాలను నిషేధించాలి.అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఫెంటానిల్‌ తయారీకి చైనా ప్రభుత్వం కంపెనీలకు రాయితీలు ఇస్తున్నది.రహస్యంగా పనిచేస్తున్న చైనా బాంకులు ఫెంటానిల్‌ సరఫరాదార్లకు తోడ్పడుతూ వచ్చిన లాభాలను స్వంతం చేసుకుంటున్నాయి. ఇలాంటి సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించాలి.నగదు చేతులు మారకుండా అవసరమైన మేరకు చట్టాలను సవరించాలి.

పార్లమెంటరీ కమిటీ ముందు ఈ అంశాలన్నింటినీ చెప్పిన తరువాత రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ బైరన్‌ డోనాల్డ్స్‌ అమెరికా మద్దతు ఇస్తున్న తైవాన్‌ చట్టం పేరుతో ఒక బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టాడు. తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వాలని, అమెరికా పత్రాల్లో చైనీస్‌ తైపే అనే పదాలకు బదులు తైవాన్‌ అని సవరించాలని, ఆ మేరకు అన్ని వెబ్‌సైట్లలో మార్చాలని ప్రతిపాదించాడు. అమెరికాకు వ్యూహ్మాక భాగస్వామిగా తైవాన్‌ ఉండాలని బైరన్‌ చెప్పాడు. ప్రపంచ వేదికల మీద చైనా తన ప్రభావాన్ని పెంచుకొనేందుకు చూస్తున్నదని అన్నాడు.డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి వచ్చిన తరువాత మరోసారి చైనా మీద వాణిజ్య యుద్ధం ప్రారంభించిన తరువాత ఇలాంటి రెచ్చగొట్టే అంశాలను పార్లమెంటులో ప్రతిపాదించటం ఆశ్చర్యం కలిగించటం లేదు. ఇంకా ఇలాంటివి ఎన్నింటిని చూడాల్సి వస్తుందో !

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...