జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దొద్దని చెప్పడం.. ఇంకో భాషను ధ్వేషించడం కాదని, స్వాభిమానంతో తమ మాతృ భాషను, తల్లిని కాపాడుకోవడం అని హితవు పలికారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కు ఎవరైనా చెప్పండంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్‌రాజ్ ఈ విధంగా స్పందించారు. ఇంతకూ పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. ‘మాట్లాడితే దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు. అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు వద్దు అంటుంటే నా మనసులో ఒకటే అనిపిస్తుంది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గఢ్ నుంచి డబ్బులు కావాలి.. పనిచేసే వాళ్లు అందరూ బీహార్ నుంచి కావాలి కానీ హిందీని ద్వేషిస్తాం అంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తుందంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తరచూ పవన్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా #justasking ట్యాగ్ తో సెటైర్లు, కౌంటర్ కామెంట్స్ చేసే ప్రకాశ్‌రాజ్ తాజాగా హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు.
"మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… 🙏🏿🙏🏿🙏🏿 #justasking
— Prakash Raj (@prakashraaj) March 14, 2025