* భవిష్యత్ లో అమరావతికి కాలుష్యపు సెగ..
* నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు పాటించాలి..
* నెలాఖరులోకా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతాం..
* సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి విద్యుత్ అందిస్తున్న ఇబ్రహీంపట్నలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు హరిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని బూడిద చెరువు తదితర ప్రాంతాలను బాబురావుతోపాటు జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ తదితరులు ఇవాళ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల్లోని స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యం క్రమంగా క్షీణిస్తోందన్నారు. జనమంతా శ్వాసకోస వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. మరికొందరు కిడ్నీ వ్యాధులతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్లాంట్ నుంచి వస్తున్న పొగ, దుమ్ము, ధూళి, బొగ్గు వలన వస్తున్న కాలుష్యంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారని చెప్పారు. కలుషిత నీటితో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, పక్షులు, జంతువులు సైతం కాలుష్యానికి బలి అవుతున్నాయని చెప్పారు.
మరోవైపు బూడిద అక్రమ తరలింపు వ్యవహారంలో పాలక పార్టీల నేతలు, ఉన్నతాధికారులు బడా కంపెనీలతో కలిసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. నాసిరకం బొగ్గు వాడకం వల్ల కాలుష్యం పెరుగుతోందని, నిపుణుల కమిటీ తనిఖీ చేసి కాలుష్య నివారణలో విద్యుత్ ప్లాంట్ యాజమాన్యం పలు ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారించిందని చెప్పారు. రోడ్లు, కాలువలు బూడిదతో నిండిపోయాయని, బూడిద స్టాక్ పాయింట్లు పెట్టి కాలుష్యం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా మార్చి నెలాఖరులోపు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో ఆందోళన చేపడతామని సిహెచ్ బాబురావు, డి.వి.కృష్ణ ప్రభుత్వా్న్ని హెచ్చరించారు.
కాలుష్యం ప్రభావిత ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, స్థానికులందరికీ ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎయిమ్స్, హెల్త్ యూనివర్శిటీలు ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రజారోగ్యంపై సర్వే చేయించి, నివేదిక రూపొందించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. కలుషిత నీటి నుంచి పంట పొలాలను కాపాడాలని, కాలుష్యం కారణంగా మరణించిన, అనారోగ్యం బారినపడిన కుటుంబాలకు రూ.50లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం కాలుష్యం సమస్యపై అసెంబ్లీలో చర్చించాలని, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని, అవినీతిని అరికట్టడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఎం నేతలు కోరారు.