హైదరాబాద్ : తమ కుమార్తె విషయంలో చోటుచేసుకున్న మనస్పర్థల వల్ల నిద్ర పట్టకపోవడంతో అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకోవడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని, ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపారు సింగర్ కల్పన. ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్బీ పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…
కల్పన గత ఐదేళ్లుగా భర్తతో కలిసి హైదరాబాద్ లోని విల్లాలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె దయ ప్రసాద్ కి, కల్పనకు మధ్య చదువు విషయంలో ఇటీవల మనస్పర్ధలొచ్చాయి. అనంతరం ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. అదే సమయంలో కల్పన భర్త ప్రసాద్.. ఆమెకు పలుసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. దీంతో ప్రసాద్ కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేసి చెప్పగా వారు డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు, కాలనీ వెల్ఫేర్ సభ్యులు ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో ఇంటి వెనుక వైపు కిచెన్ డోర్ నుంచి లోనికి ప్రవేశించి, బెడ్ రూంలో అపస్మారక స్థితిలో పడివున్న కల్పనను సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు.
అయితే, తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్టు పోలీసులు తెలిపారు. తనకూ, తన కుమార్తెకు జరిగిన వివాదంతో తాను నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నట్టు ఆమె చెప్పారని పోలీసులు ఆ లేఖలో పేర్కొన్నారు.