– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.
చైనా నుంచి బయటకు వచ్చే ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు, మేకిన్, మేడిన్ ఇండియా పధకాలను కొనసాగింపుగా అత్మనిర్భరత పధకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఉత్పాదకతతో ముడిపడిన నగదు ప్రోత్సాహక పధకాన్ని (పిఎల్‌ఐ) ప్రధాని నరేంద్రమోడీ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. అది ఆశించిన లక్ష్యాలకు సుదూరంగా ఉండటంతో నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాయిటర్ వార్తా సంస్థ పేర్కొన్నది. జాతీయ పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ఇచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పిఐబి ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. దాన్ని కొనసాగిస్తున్నట్లు లేదా నిలిపివేస్తున్నట్లుగానీ చెప్పకుండా ఆ పధకం ద్వారా జరిగిందాని గురించి పెద్ద వివరణ ఇచ్చింది. పిఎల్‌ఐ పధకం కింద రు.1.97లక్షల కోట్ల రూపాయలను(డాలర్లలో 23 బిలియన్లు) కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇచ్చేందుకు పక్కన పెట్టింది. ఈ మొత్తాన్ని 2019`20 ఆర్థిక సంవత్సరంతో ప్రారంభించి నాలుగు లేదా ఆరు సంవత్సరాలలో ఉత్పత్తి, ఎగుమతులు చేసే సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని అమలు జరిపితే జిడిపిలో పారిశ్రామిక ఉత్పత్తి వాటా 25శాతానికి పెరుగుతుందని చెప్పారు. ఈ పధకాన్ని గతంలో ప్రకటించిన 14పైలట్ రంగాలు, నిర్దేశించిన గడువును పొడిగించకూడదని నిర్ణయించినట్లు వార్త. వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ పధకాన్ని సమీక్షించి ఈ మేరకు నిర్ణయించిందని, తనకు అందిన ఆ నివేదిక వెల్లడిరచిందని రాయిటర్స్ పేర్కొన్నది. ఈ పధక వైఫల్యం గురించి వ్యాఖ్యానించాలని కోరగా ప్రధాని కార్యాలయం, వాణిజ్య మంత్రిత్వశాఖ స్పందించలేదని వార్తా సంస్థ పేర్కొన్నది. ఈ పధకాన్ని నిలిపివేసినంత మాత్రాన ఉత్పాదక లక్ష్య్యాలను వదలివేసినట్లు కాదని, ప్రత్యామ్నాయాలను రూపొందిస్తారని ఇద్దరు అధికారులు చెప్పినట్లు కూడా పేర్కొన్నది.కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్న వివరాలు కూడా పిఎల్‌ఐ పథక వైఫల్యాలను నిర్ధారించాయి.
రాయిటర్స్ వార్త సారాంశం దిగువ విధంగా ఉంది. యాపిల్ ఫోన్లను సరఫరా చేసే ఫాక్స్‌కాన్, రిలయన్స్‌తో సహా 750 కంపెనీలు ఈ పధకం కింద రాయితీ పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం గడువును పెంచాలని అనేక సంస్థలు కోరినప్పటికీ అంగీకరించకూడదని అధికారులు తమ అభిప్రాయాలను సమీక్షలో నమోదు చేశారు. అనేక సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించలేదు. దారిలో ఉన్నవారు కూడా నత్తనడక నడుస్తున్నట్లు తేలింది. 2024 అక్టోబరు నాటికి కొన్ని సంస్థలు 151.93 బిలియన్ డాలర్ల విలువగల వస్తూత్పత్తి చేశాయని, ఇది నిర్దేశిత లక్ష్యంలో 37శాతమే అని తేలింది. ప్రోత్సాహకం కింద పక్కన పెట్టిన 2,300 కోట్ల డాలర్లకు గాను ఇప్పటివరకు సంస్థలకు చెల్లించింది కేవలం 173 కోట్ల డాలర్లు లేదా ఎనిమిది శాతం మాత్రమేనని కూడా తేలింది. ఈ పధకం ప్రారంభించినపుడు ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పాదకత వాటా 15.4శాతం ఉండగా ప్రస్తుతం 14.3శాతానికి పడిపోయింది. పిఎల్‌ఐ పధకం వలన ఔషధ, సెల్‌ఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగినట్లు గతేడాది ప్రభుత్వం సమర్ధించుకుంది. కనీస వృద్ధి లక్ష్యాలను చేరుకోని కారణంగా కొన్ని నమోదైన సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదని సమీక్ష నివేదికలో పేర్కొన్నారు. సోలార్ రంగంలో పన్నెండు కంపెనీల నమోదు కాగా వాటిలో రిలయన్స్, అదానీ, జెఎస్‌డబ్ల్యుతో సహా ఎనిమిది లక్ష్యాలకు చేరే అవకాశం లేదని 2024 డిసెంబరు సమీక్షలో తేలింది. 2027 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించినదానిలో రిలయన్స్ కంపెనీ కూడా 50శాతానికి మించే అవకాశం లేదని వెల్లడైంది. అప్పటికి పధకం గడువు ముగిసిపోతుంది. అదానీ కంపెనీ తయారీకి అవసరమైన పరికరాలనే కొనుగోలు చేయలేదు. పథకం గడువు 2027 తరువాత పొడిగించాలని పునరుత్పాదక ఇంథన మంత్రిత్వశాఖ చేసిన వినతిని వాణిజ్యశాఖ తిరస్కరించింది. అసలు పనిచేయని వారికి లబ్ది చేకూర్చటం తగనిపని అని పేర్కొన్నది. ఉక్కు రంగంలో నమోదైన 58 కంపెనీలలో ఎలాంటి పురోగతి లేని 14ను జాబితా నుంచి తొలగించారు.
రాయిటర్స్ వార్త తరువాత శనివారం నాడు పిఐబి విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పిఎల్‌ఐ పధకంతో స్థానిక ఉత్పత్తి పెరిగింది, కొత్త ఉపాధి వచ్చింది, ఎగుమతులకు ప్రోత్సాహం వచ్చింది.2024 నవంబరు నాటికి ప్రోత్సాహక మొత్తం కారణంగా రు.1.61లక్షల కోట్ల పెట్టుబడి రాగా, 14లక్షల కోట్ల మేర ఉత్పత్తి జరిగింది,రు.5.31లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి, 11.5లక్షల ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి. పద్నాలుగు రంగాలలో 764 దరఖాస్తులను ఆమోదించగా వాటిలో 176ఎంఎస్‌ఎంఇ సంస్థలున్నాయి. పది రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహక మొత్తం రు.14,020 కోట్లు విడుదల చేశారు. అనేక పరిశ్రమలు అమలు దశలో ఉన్నాయి, తరువాత అవి ప్రోత్సాహకాలకు దరఖాస్తులు చేస్తాయి. ఉక్కు రంగంలో రు.27,106 కోట్ల మేరకు పెట్టుబడులు పెడతామని చెప్పిన కంపెనీలు రు.20వేల కోట్లు పెట్టాయని, తొమ్మిది వేల మందికి ఉపాధి దొరికిందని, ఇప్పటి వరకు 48 కోట్లు ప్రోత్సాహకం ఇచ్చినట్లు, 58 ప్రాజెక్టులకు గాను 14 వెనక్కు తగ్గినట్లు, పిఎల్‌ఐ రెండవ దశలో ఇరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులతో 35 కంపెనీలు ఆసక్తి చూపినట్లు పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పినప్పటికీ నాలుగు సంవత్సరాల తరువాత రు.1.97లక్షల కోట్ల సబ్సిడీ మొత్తంలో విడుదల చేసింది రు.14,100 కోట్లే అని స్వయంగా చెప్పిందంటే ఏడుశాతం మొత్తం కూడా ఖర్చు కాలేదు, రాయిటర్స్ కథనం వాస్తవమే అని తేలింది. మేకిన్, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భరత పేర్లతో పదేండ్లుగా కాలక్షేపం చేసినా ఫలితం దక్కలేదు గనుక మరొక పేరుతో ప్రయోగాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.
అంతా వారే చేశారని గోబెల్స్‌ను పూజిస్తూ కాంగ్రెస్ మీద పదే పదే ప్రచారం చేయటం తప్ప పదేండ్లలో మోడీ ఏం చేశారన్నది ప్రశ్న. సమావేశాల మీద సమావేశాలు, ముసాయిదా విధానాల పేరుతో భారత్ కాలక్షేపం చేస్తుండగా చైనా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఒక్క గుండుకూడా పేల్చకుండా, చేయాల్సింది చేస్తోందని బిజినెస్ టుడే పత్రిక 2025 మార్చి 22న ఒక కథనాన్ని ప్రచురించింది. వివేక్ ఖత్రి అనే చార్టడ్ ఎకౌంటెంట్, ఇన్ఫ్లుయెన్సర్ చేసిన ఎక్స్ పోస్టును, అభిప్రాయాలను ఉటంకించింది. ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తి క్రీడలో ఎలాంటి శబ్దం, పతాకశీర్షికలు లేకుండా మౌనంగా భారత్‌ను పక్కకు నెట్టే వ్యూహాన్ని చైనా అనుసరించిందని అతను ఆరోపించాడు. చైనా లక్షకోట్ల డాలర్ల వాణిజ్య మిగులు అంటే కేవలం ఆర్థిక గణాంకం కాదని భూ భౌతిక రాజకీయ అస్త్రమన్నాడు. ప్రపంచ కంపెనీలు చైనా ప్లస్ ఒన్ అనే వ్యూహంతో బీజింగ్‌ను వెనక్కు నెట్టకుండా హంగరీ, మెక్సికో, మొరాకో, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు చక్కగా చైనాతో చేతులు కలుపుతున్నాయని, చైనాతో పోటీ లేని ఉత్పాదక వాతావరణంలో ఉదారంతో విదేశీ పెట్టుబడులను పొందుతున్నాయని వివేక్ ఖత్రి పేర్కొన్నాడు.
భారత్‌ను ఎదగనీయకుండా చైనా చూస్తున్నదని వివేక్ వంటి వారు చెప్పటం ఆడలేక మద్దెల ఓడు అనటం తప్ప మరొకటి కాదు. భారత పరిశ్రమలకు అవసరమైన కీలక విద్యుత్ వాహనాల విడిభాగాలు, సోలార్ మాడ్యూల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పతికి అవసరమైన పరికరాలను చైనా అడ్డుకుంటున్నదని, భారత సరఫరా గొలుసు సామర్ద్యాన్ని నిర్మించకుండా తన కార్పొరేట్లను నిరోధిస్తూ ఫాక్స్‌కాన్,బివైడి కంపెనీల విస్తరణను నిరుత్సాహపరుస్తున్నదని వివేక్ ఖత్రి ఆరోపించారు. ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో నాలుగో వంతు భారత్‌లో చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 15శాతమే జరుగుతున్నన్నారు. భారత్ 26 బిలియన్ డాలర్ల విలువగల ఎలక్ట్రానిక్స్ ఎగుమతి చేస్తుండగా వియత్నాం 126 బిలియన్ డాలర్లు చేస్తున్నదని , తైవాన్, జపాన్ సంస్థలు వెనక్కు పోతున్నట్లు చెప్పారు. జపాన్‌కు చెందిన పదింటిలో ఒక కంపెనీ మాత్రమే భారత్‌లో పెట్టుబులు పెట్టేందుకు చూస్తున్నదని అది కూడా నియంత్రణల సంక్లిష్టత, రెడ్‌టేప్, అమలు జరపగలమా లేదా అన్న అనిశ్చితి ఉన్నట్లు చెప్పిందని వెల్లడిరచారు. తక్కువ విలువగల పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులను భాగస్వామ్య దేశాలకు అప్పగిస్తూ కీలకమైన, మేథోసంపత్తి హక్కులున్నవాటిని చైనా అట్టిపెట్టుకుంటున్నదని, దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద మొరాకో నుంచి మెక్సికో వరకు పారిశ్రామిక నడవాలను నిర్మిస్తున్నదని, తన అవసరాలకు అనుగుణంగా ప్రపంచీకరణను మలుచుకుంటున్నదని ఖత్రి విమర్శించారు.
భారత్ ముందుకు పోతుంటే అడ్డుకుంటున్నదని చైనాను నిందించేవారు నిత్యం కనిపిస్తారు. గతంలో చైనాను చక్రబంధం చేస్తే దాన్నుంచి బయటపడేందుకు అది అనుసరించిన విధానాలు తప్ప ప్రత్యేకించి ఎవరూ చేయూతనిచ్చి పైకి లేపలేదు. ధనిక దేశాలు తమ వద్ద మూలుగుతున్న పెట్టుబడులను అలాగే ఉంచుకుంటే వడ్డీ కూడా రాని స్థితిలో చైనాలో పెట్టుబడులు పెట్టాయి తప్ప కమ్యూనిస్టుల మీద ప్రేమతో కాదు.జపాన్‌లో ఎవరన్నా డబ్బుదాచుకోవాలంటే బ్యాంకులకు ఎదురు చెల్లించాలి తప్ప ఎలాంటి వడ్డీ ఉండదు.ధనిక దేశాల్లో శ్రామికులకు ఎక్కువ మొత్తాలు వేతనాలు చెల్లించాలి, చైనాలో జనాభా ఎక్కువ గనుక చౌకగా పనిచేయించుకొని ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలని అవే ధనికదేశాలు చూశాయి. తమ జనానికి పని చూపాలి, అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు కావాలి గనుక చైనా సంస్కరణల బాట పట్టి నేటి స్థితికి ఎదిగింది, దానికి అది అనుసరించిన స్థిరమైన, విశ్వసనీయమైన విధానాలే కారణం. ఆత్మనిర్భరత పేరుతో రెండు లక్షల కోట్ల నగదు ప్రోత్సాహం ఇస్తామన్నా కంపెనీలు ఎందుకు రాలేదో, వచ్చినవి ఎందుకు ఉత్పత్తిచేయలేదో ఆలోచించాల్సిందిపోయి, చైనా అడ్డుకున్నదని చెబితే కుదురుతుందా !
ఇప్పటికీ చైనా గురించి అనేక అతిశయోక్తులు, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. చౌకరకం వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నది వాటిలో ఒకటి. అలాంటి వస్తువులను దిగుమతి చేసుకోవటంలో నరేంద్రమోడీ రికార్డులను బద్దలు కొట్టారు, అమెరికా, ఐరోపా దేశాలకు అవి లేకపోతే రోజు గడవదు. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నట్లు ? మరోవైపు చైనా మీద పడి ఎందుకు ఏడుస్తున్నట్లు ? చైనా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని, అక్కడి నుంచి విదేశీ పరిశ్రమలు, కంపెనీలు బయటకు వెళుతున్నాయని, అవి హిమాలయాలను దాటి భారత్ వస్తున్నట్లుగా అనేక మంది చిత్రించారు. కరోనా తరువాత అతిశయోక్తులు ఎన్నో. ఏ ఒక్కటీ నిజం కాలేదు. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో దేశ జిడిపి 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బిజెపి ఐటి సెల్ అధినేత అమిత్ మాలవీయ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా చెప్పారు. 2004మన్మోహన్ సింగ్ అధికారానికి వచ్చినపుడు జిడిపి 709 బిలియన్ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యుపిఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు ఎక్కువని చెబుతారు. అబద్దాలలో పుట్టి అబద్దాలలో పెరుగుతున్నవారు తప్ప ఇలాంటి తప్పుడు ప్రకటనలు మరొకరు చేయరు.