SUMMER: మార్చిలోనే ఉండలేకపోతున్నాం. ఇంక ఏప్రిల్, మే పరిస్థితి..ఊహించుకుంటుంటే భయం పుడుతోంది. కాలు బయటపెట్టగలమా? వెంట కచ్చితంగా పాకెట్ ఫ్యాన్, గొడుగు ఉండాల్సిందేనా? ఇంత ఎలివేషన్ దేనికీ అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు అర్థమైపోయింటుంది.
బాబోయ్..ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటాక బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. సూర్యుడు..సుర్ సుర్ అంటున్నాడు. వేడి గాలులు..సెగలు కక్కుతున్నాయి. ఉక్కపోత ఊపిరాడనివ్వట్లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే..ముందున్న 2 నెలలు మాడిపోతామేమో. అంతలా ఎండలు భయపెట్టిస్తున్నాయి. ఈ 3 నెలలు కాస్త వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు..జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నార్మల్ గా 30 డిగ్రీలు ఉంటేనే వేడిని తట్టుకోలేం. అలాంటిది..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. రానున్న 2 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతోందని చెబుతున్నారు.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
అటు ఏపీలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. విజయవాడ, గుంటూరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే పరిస్థితి తలుచుకుని బెంబేలెత్తిపోతున్నారు. నీళ్లు, పళ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.