గాల్లో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురికావడంతో ప్రయాణికులంతా సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. కొందరు ఏకంగా పైకప్పు వరకూ ఎగిరారు. చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన లగేజ్ బ్యాగులు, ఎయిర్ హోస్టెస్లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు గురికావడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. స్వీడన్ నుంచి ఫ్లోరిడాకు వెళుతున్న విమాన ప్రయాణికులకు ఈ భయానక అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రయాణికులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. స్కాండినేవియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఇవాళ మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీ లో దిగాల్సి ఉండగా.. మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. ప్రయాణికులు సీట్లలో ఎగిరిపడడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్ లో దింపేశాడు. ఆపై ప్రయాణికులకు రాత్రి వసతి కల్పించి, తెల్లవారి మరో విమానంలో మయామికి పంపించారు.
🚨 #BreakingNow A video from #SK957 cabin as extreme turbulence hit a SAS A330 over Greenland,throwing unbuckled passengers into the ceiling.This incident highlights how turbulence can occur without warning,making seatbelts essential for passenger safety. https://t.co/iYVA4IIUER pic.twitter.com/S4kCaKwnn0
— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) November 15, 2024