* జగన్ పైనా, వైసీపీ నేతలపైనా నాగబాబు సెటైర్లు
* జనసేనకు ఈ పుష్కరం మంచి పరిణామం
* పవన్ లాంటి వ్యక్తికి సేవ చేయడం నా అదృష్టం
పిఠాపురం: జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. అధికారంలో లేనప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడం కుదరదు.. ఆచీతూచీ మాట్లాడాలని అంటూనే… వైసీపీ అధినేత జగన్ పైనా, ఆ పార్టీ నాయకులపైనా సెటైర్లు వేశారు నాగబాబు. జనసేన అధినేత పవన్ ఒక శక్తి అని, మా తల్లికి పురిటి నొప్పులు తెలియకుండా జన్మించిన వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు రానిస్తాడా అంటూ తమ్ముడిని పొగడ్తలతో ముంచెత్తాడు. జగన్ మొన్నీ మధ్య కళ్లు మూసి తెరిచే లోగా 9 నెలలు గడిచిపోయిందని, నాలుగేళ్లు కూడా అలాగే అయిపోతుందని, తర్వాత మనమే అధికారంలోకి వస్తామని సినిమాల్లో కమెడిన్ లాగా కలలు కంటున్నాడని విమర్శించారు. ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉండేది తామేనని, జగన్ కలలు కంటూ నిద్రపోవాలని ఆయన సలహా ఇచ్చారు. పిఠాపురంలో పవన్ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని, కాకపోతే తామంతా ఊరికే పనిచేసినట్టు నటించామని చెప్పారు. పవన్ గెలుపు వెనుక ఎవరి పాత్ర లేదేని, తన వల్లే గెలిచాడని అనుకుంటే నీ ఖర్మ అంటూ మాజీ ఎమ్మెల్యే వర్మకు చురకలు వేశారు నాగబాబు. హిందూ సాంప్రదాయం ప్రకారం నదులకు 12ఏళ్లకు ఓసారి పుష్కరాలు వస్తాయని, అలాగే, జనసేన పార్టీకి 12 ఏళ్లకు అధికారం వచ్చిందని చెప్పారు. వందకు వంద శాతం పవన్ అద్భుత విజయాన్ని సాధించారన్న నాగబాబు… భవిష్యత్ తరాల కోసం జనసేన అధినేత నిరంతరం కృషి చేస్తారని అన్నారు.