* సాయంత్రం ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్…
* ఆశావహుల జాబితా ఇదే..
* ఎవరికి వారే లాబీయింగ్..
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆశావాహులు సైతం అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణపై దోబూచులాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇక విస్తరణకు ముహూర్తం ఖరారు చేసింది. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ హైకమాండ్ సైతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ తథ్యం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురుకి పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు పిలుపువచ్చింది. ఈ క్రమంలో మధ్యాహ్నం నేతలంతా ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పలు కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కలు రద్దు చేసుకున్నారు.
సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి టీం..
తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. దీంతో హైకమాండ్ నుంచి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు పిలుపు వచ్చింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఢిల్లీ పర్యటనలోనే కేబినెట్ విస్తరణకు ముహూర్తం, జాబితా ఖరారు చేసుకుని వస్తారని తెలుస్తోంది.
ఖాళీగా ఉన్న 6 బెర్తులు…
2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న 6 బెర్తులను మాత్రం పూర్తి చేయడం లేదు. అదిగో మంత్రివర్గ విస్తరణ.. ఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ లీకులు వస్తున్నాయే తప్ప ఏడాది దాటేసినా ఇప్పటికీ విస్తరణ జరగలేదు. అయితే, మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే ఆలస్యమైందని, సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో అధిష్టానంపై ఒత్తిడి పెంచడంతో అక్కడ కూడా కదలికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి టీం మంత్రుల జాబితాను తీసుకెళ్లి ఆమోద ముద్ర వేయించుకోవడమే తరువాయి అన్నట్లు తెలుస్తోంది.
ఆశావహులు వీరే…
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంత్రి పదవి ఆశిస్తున్న జాబితాలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారు తమకే పదవి లభిస్తుందన్న ధీమాలో ఉన్నారు. వీరితోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు, మరోవైపు వివేక్, వినోద్ సోదరులు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి వర్గవిస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోనే సీనియర్ ఎమ్మెల్యే కావడం… వైఎస్ఆర్ హయాంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో తనకు ఈసారి మంత్రివర్గంలో చోటు ఖాయంగా భావిస్తున్నారు.