హైదరాబాద్: త్వరలో…తెలంగాణాలోని విద్యార్థులకు తీపి కబురు అందించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం . విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తేచాలు … ఆ పట్టాతో ఉద్యోగం పొందాలి. లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పోటీ పరీక్షలకు ఎలాంటి ప్రత్యేక కోచింగ్ లేకుండా పోటీపడాలి. అది కాకుంటే… వారే సొంతంగా స్వయం ఉపాధి చూసుకునేలా తయారవ్వాలి….అని ఉన్నత విద్యామండలి తదనుగుణంగా సిలబస్‌లో మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తోంది.
బీఎస్సీ, బీకాంలతోపాటు బీఏ కోర్సులోనూ నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి సెమిస్టర్‌లో ఒక టెక్నాలజీ సబ్జెక్టును తప్పనిసరి చేయనుంది. డిగ్రీ మూడేళ్ల కోర్సుకు మొత్తం 120 క్రెడిట్లు, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సుకు 160 క్రెడిట్లు ఇవ్వనున్నారు.
ప్రస్తుత తరుణంలో టెక్నాలజీపై అవగాహన లేకుంటే కెరీర్‌లో రాణించడం కష్టం. పరిశ్రమలకు తగినట్లు విద్యార్థులను తీర్చిదిద్దాలి. బీఏ లాంటి కోర్సులు చేసిన చదువు పూర్తయ్యేలోపు ఉద్యోగ నైపుణ్యాంతో బయటకు వెళ్లాలి… అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ చెబుతునే ఉన్నారు. ఈ మేరకు మూడేళ్ల డిగ్రీలో సెమిస్టర్‌కు ఒకటి చొప్పున సాంకేతికతకు సంబంధించిన పేపర్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఆంగ్లం అంటే ఇప్పటివరకు కొందరు ప్రముఖ రచయితల పాఠాలు, కవిత్వం లాంటి వాటికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు. తొలి సెమిస్టర్‌లో ప్రథమ భాషగా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ , రెండో సెమిస్టర్‌లో క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్, మూడో సెమిస్టర్‌లో బిజినెస్ కమ్యూనికేషన్ పేరిట ఆంగ్లం సబ్జెక్టు ఉంటుంది. బీకాంలోనూ అదేమాదిరిగా టెక్నాలజీ పేపర్లు ఉండనున్నాయి. బీఎస్సీ గణితం లాంటి వాటిల్లో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమేటిక్ లాంటి వాటిని సైతం చేరుస్తున్నారు. త్వరలో సిలబస్‌ను ఖరారు చేసి, విశ్వవిద్యాలయాల ఆమోదం కోసం పంపనుంది. ఆ తర్వాత తెలుగు అకాడమీ పుస్తకాలను ముద్రించనుంది.