26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణా ను తరలిస్తోన్న విమానం మరికొద్ది సేపట్లో… భారత్‌కు రానుంది. ఈ నేపథ్యంలో తీహార్ జైల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు . ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ…. ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు డిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తరఫున వాదనలు వినిపించనున్నారు. ఏది ముందుగా పూర్తయితే దానిని పరిగణనలోకి తీసుకుంటారు.
తహవ్వుర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం భారత్‌కు తీసుకువస్తున్నారు. బుధవారం రాత్రి 7:10 గంటలకు ప్రత్యేక విమానంలో తహవ్వుర్‌ను తీసుకుని అధికారులు ఇండియాకు బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం వీరు ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక అతడిని ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసి.. డిల్లీలోని తిహార్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం. జైలు నంబర్ 2లో అతడిని ఉంచనున్నట్లు తెలుస్తోంది.
ఉగ్రదాడి సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి సామాన్యుల ప్రాణాలు కాపాడేందుకు సహకరించిన ముంబయి చాయ్‌వాలా మహమ్మద్ తౌఫిక్ మాట్లాడుతూ.. రాణాకు జైల్లో బిర్యానీ అందించడం వంటి సౌకర్యాలు కల్పించకూడదని కోరారు. ఆ మారణహోమంలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు జైల్లో బిర్యానీ పెట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కసబ్‌ను 2012 నవంబర్ 21న ఉరితీశారు.