లైంగిక వేధింపులకు గురై, ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్థిని (23) పన్నెండు రోజులుగా.. మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన యువతి రాజమహేంద్రవరం సమీపంలోని ఫార్మా కళాశాలలో చివరి ఏడాది చదువుతుంది. శిక్షణ నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే దువ్వాడ మాధవరావు దీపక్ అనే వ్యక్తి ఆమెను నమ్మించి లైంగికంగా వేధించి మోసగించాడు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి నా గొంతు కోశాడు…. నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. అమ్మ, నాన్న నన్ను క్షమించండి…. అంటూ లేఖ రాసిపెట్టి, గత నెల 23న ఆసుపత్రిలో అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. 12 రోజులుగా అదే ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది.
తమ బిడ్డను మోసగించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అని బాధితురాలి తండ్రి కన్నీటిపర్యంతమ్యారు . ప్రభుత్వం, ఆసుపత్రి వైద్యుల నుంచి మాకు పూర్తి సహాయ సహకారాలందాయి కానీ మా బిడ్డ దక్కలేదన్నారు.