భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ గుజరాత్‌లోని జామ్‌నగర్ ఐఏఎఫ్ స్టేషను సమీప గ్రామ మైదానంలో బుధవారం రాత్రి కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైమానిక దళ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాద సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటోంది. ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసిన క్లిష్టపరిస్థితుల్లోనూ ఆయన తన గురించి ఆలోచించకుండా తోటి పైలట్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. మరో పైలట్‌ను ఫైటర్ జెట్ నుంచి బయటపడేసి తాను మాత్రం ప్రాణత్యాగం చేశారు. అంతేకాదు.. పౌరులకు ఎలాంటి హానీ జరగకూడదని భావించి నివాస ప్రాంతాలకు దూరంగా విమానాన్ని తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. సిద్ధార్థ్‌కు 10 రోజుల కిందటే డిల్లీకి చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన అతడు.. అంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదకరం.