రానున్న రోజుల్లో… రాష్ట్రంలో సన్న బియ్యం ధరలు భారీగా తగ్గనున్నాయి. వరి సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనసే కారణమని తెలుస్తుంది.
మార్కెట్‌లో సన్న బియ్యం సమృద్ధిగా దొరుకుతుండటంతో వాటి ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ … దీని ప్రభావం పడిందని బియ్యం ఎగుమతిదారులు చెబుతున్నారు. బోనస్ ప్రకటించక ముందు రాష్ట్రంలో ప్రీమియం రకం సన్న బియ్యం కిలోకు రూ.60-70 వరకు ఉండేవి. ప్రస్తుతం రూ.50-55 వరకు ఉన్నాయి. ఫైన్ రకం రూ.55-60 ఉండేవి. ఇప్పుడు రూ.43-48కు దొరుకుతున్నాయి. సన్న బియ్యం రకాన్ని బట్టి గతంలో కంటే ఇప్పుడు కిలోకు రూ.10-15 వరకు తగ్గాయి. రిటైలర్లు మాత్రం కిలోకు రూ.5-8 వరకే తగ్గిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ సన్న బియ్యానికి కింటాల్ కి రూ. 2320 ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం సన్న రకాల సాగును ప్రొత్సహించేందుకు కింటాల్ కు రూ. 500 బోనస్ ప్రకటించినందున బోనస్ తో కలిపి ప్రతి కింటాల్ కు 2820 చెల్లించింది. సాధారణ రకానికి రూ.2,300 బోనస్ తో కలిపి రూ. 2800 ప్రకటించింది. ఖరీఫ్(వానాకాలం) సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తోంది. బోనస్ ప్రకటనతో రాష్ట్రంలో సన్నాల సాగు 2023 ఖరీఫ్‌తో పోలిస్తే 2024 ఖరీఫ్‌లో 50 శాతానికిపైగా పెరిగింది.
సన్న బియ్యం దిగుబడి పెరగడంతో మార్కెట్లోకి భారీగా ధరలు తగ్గాయి. ప్రతి సీజన్‌లో తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల మిల్లర్లు, వ్యాపారులు పెద్దమొత్తంలో సన్న ధాన్యం కొనుగోలు చేస్తుంటారు. సన్నాల సరఫరా పెరగడంతో ఆ రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గాయని రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. అంతే కాకుండా ..ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాల నుంచీ రాష్ట్రానికి సన్న బియ్యం వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘భారత్ బ్రాండ్’ పేరుతో సబ్సిడీ బియ్యం విక్రయాల్ని కొద్ది నెలల క్రితం నుండి ప్రారంభించడం కూడా కొంత ప్రభావం చూపుతోందని అంటున్నారు.
రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం కావడంతో సన్నబియ్యం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. రేషన్ కార్డులున్న పేద, మధ్యతరగతి ప్రజలు రైతుల నుండి సన్న బియ్యం కొనడం లేదు. ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యం కోసం ఎదురుచూస్తున్నారని …. అని తెలంగాణ రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గణపతిరెడ్డి తెలిపారు.