HomeEditorialEditorial : విదూషకుడు కునాల్‌ కమ్రా హాస్య వీడియో వివాదం : గూండాయిజం, బుల్డోజర్లతో భావ...

Editorial : విదూషకుడు కునాల్‌ కమ్రా హాస్య వీడియో వివాదం : గూండాయిజం, బుల్డోజర్లతో భావ ప్రకటనా స్వేచ్చ హరించే యత్నం !

Published on

spot_img

– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.

దేశంలో ఏం జరుగుతోంది ? చిన్న పాటి వ్యంగ్యం, జోక్‌, విమర్శలను కూడా సహించని శక్తులు రెచ్చిపోతున్నాయి. అధికార యంత్రాంగం అలాంటి వారి చేతుల్లో పనిముట్టుగా మారుతోంది. విదూషకుడు కునాల్‌ కమ్రా వంటి వారు, మిమిక్రి కళాకారులు,చతురోక్తులతో విమర్శలు చేసే వారు, కార్టూనిస్టులు, సినిమా వారు ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న రాజకీయ నేతల తీరుతెన్నులను హాస్య భరితంగా జనం ముందు ఎండగట్టారో వారికి మూడిరదే. వెంటనే గూండాలు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టిస్తారు. వీధుల్లో తిరగనీయం, ప్రాణాలు తీస్తామని బెదిరిస్తారు. సంబంధిత వ్యక్తులు, సంస్థల భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు స్థానిక సంస్థల సిబ్బందికి అప్పుడే గుర్తుకు వస్తాయి, వెంటనే బుల్డోజర్లతో ఆఘమేఘాల మీద కూల్చివేస్తారు. ఎక్కడబడితే అక్కడ వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తారు. సినిమాల్లో మాదిరి అంతా అయిపోయాక రావటం గాక పోలీసులు సిద్దం సుమతీ అన్నట్లు ఉంటారు. ఇక మద్దతు ఇచ్చే రాజకీయ నేతలు, అవే రంగాలకు చెందిన తోటి వారు సైతం రంగంలోకి దిగి దాడులు మొదలు పెడతారు, సుభాషితాలు వల్లిస్తారు.ఈ గూండాయిజాన్ని సిపిఎం, ఉద్దావ్‌ ధాకరే శివసేన ఖండిరచాయి.

చట్ట ప్రకారం తప్పు చేసిన వారిని ఎవరూ సమర్ధించరు. భావప్రకటనా స్వేచ్చ హద్దులేమిటో చట్టాల్లోనే ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే వాటి ప్రకారం ఎంత పెద్దవారినైనా విచారించి శిక్షలు వేయవచ్చు. కానీ కొంత మంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వారిని చూసీ చూడనట్లు వదలివేయటంతో కొత్త వారికి ప్రోత్సాహం వస్తోంది. గతంలో ఇటలీ, జర్మనీ వంటి చోట్ల ఫాసిస్టులు, నాజీలు, కమ్యూనిస్టు వ్యతిరేకులు అదేపని చేశారు. తమ మీద విమర్శలు చేసిన వారిని తమకు నచ్చనివారిని వెంటాడారు, వేధించారు.నాగరికులమని చెప్పుకున్న, భావించిన వారిలో అనేక మంది మౌనంగా ఉన్నారు. నేటి మాదిరి అడ్డగోలు చర్యలను సమర్ధించిన మేథావులూ, కళాకారులూ నాడున్నారు, జరిగిందేమిటి ? అలాంటి వారిని చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టింది.1940,50 దశకాల్లో తెలంగాణా సాయుధ పోరాటం జరిగిన సమయంలో సాయుధ పోలీసులు గ్రామాల మీద దాడులు జరిపారు. కోస్తా ప్రాంతంలో గ్రామాలలో గాంధీ విగ్రహాలు నెలకొల్పిన కూడళ్లలో జనాన్ని మందవేసి మీలో కమ్యూనిస్టులెవరో, కాని వారెవరో స్వచ్చందంగా చెప్పండి అని ఆదేశించేవారు. కమ్యూనిస్టులు నిజాయితీగా ముందుకు వస్తే కాని వారు మేం యాంటీ కమ్యూనిస్టులం అని కొన్ని చోట్ల గొప్పగా చెప్పుకున్నారట. ఉన్న కమ్యూనిస్టులతోనే వేగలేక చస్తుంటే వారికి తోడు మరొకరు యాంటీ కమ్యూనిస్టులా అంటూ వారిని కూడా చావబాదినట్లు, బట్టలిప్పించి గాంధీ విగ్రహాల చుట్టూ తిప్పించినట్లు పెద్దలు చెప్పారు. నాటి బ్రిటీష్‌, నిజాం, నెహ్రూ సైన్యం, రిజర్వు పోలీసులకు ఆ రోజుల్లో కమ్యూనిస్టు అన్న పదం వినిపిస్తే అలా ఉండేది మరి. ఆ గుణపాఠాలను మనం తీసుకోవాలా వద్దా, మనకెందుకులే అని తప్పించుకు తిరగాలా ? అన్యాయం, అధర్మాన్ని వ్యతిరేకించకుండా మౌనంగా ఉంటే వాటికి పాల్పడేవారు సహిస్తారని భావిస్తే పొరపాటు. సమర్ధించకుండా మౌనం అంటే మమ్మల్ని వ్యతిరేకించటమే అని మౌనమునుల సంగతి కూడా చూస్తారు. దేశంలో ఇదే జరగనుంది !

ఇటీవల ముంబై హాబిటాట్‌ హాస్య కేంద్రంలో ప్రదర్శించిన కునాల్‌ కమ్రా ప్రదర్శనలో విసిరిన ఒక చతురోక్తి తమ నేత ఏకనాధ్‌ షిండేను ఉద్దేశించే అని అతగాడి నాయకత్వంలోని శివసేన మద్దతుదారులు ఆ కేంద్రంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న స్టూడియో నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెంటనే కొంత భాగాన్ని కూల్చివేశారు. నాగపూర్‌లో ఇటీవల జరిగిన అల్లర్లకు సూత్రధారి అంటూ కొందరిని పోలీసులు ఆరోపించటం, వెంటనే వారిలో ఒకరి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మునిసిపల్‌ అధికారులు కూల్చివేయటాన్ని చూస్తే పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిన విపరీతాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయా ఉదంతాలు జరిగే వరకు సదరు మున్సిపల్‌ అధికారులు ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతుంటారో ఎవరి సేవలో తరిస్తుంటారో తెలియదు. బిజెపి, దాని మద్దతుదారులు అధికారంలో ఉన్నచోట చిన్న నొప్పి అనిపిస్తే చాలు వెంటనే వారికి క్షణాల మీద అతిక్రమణలు ఎలా గుర్తుకు వస్తున్నాయో ఆఘమేఘాల మీద ఎలా కూల్చివేస్తున్నారో అంతుబట్టటం లేదు.

తెలుగు ప్రాంతాల్లో కొన్ని పదాలు ‘‘ కో పైలట్‌, జామాతా దశమ గ్రహం, వెన్నుపోటు,వైస్‌రాయ్‌ హోటల్‌ బ్యాచి, తోలు తీసేవారు, తాటవలిచే వారు, పాచిపోయిన లడ్డూలు, మాట తప్పను మడమతిప్పను, మీట నొక్కుడు, వాట్‌ అయామ్‌ సేయింగ్‌, అలా ముందుకు పోతున్నాం, ఆ రెండు పత్రికలు, సన్నాసులు, ఫాంహౌస్‌, పొట్టోడు, ట్విటర్‌ పిట్ట, గడకర్ర, భాయియోం` బహినోం, సూపర్‌ సిక్స్‌ ’’ వంటి పదాలు చలోక్తులు విసిరేందుకు,రచనలు చేసేందుకు వస్తువుగా మారుతున్నాయి. వాటితో పాటు ఇంకా అనేక పదాలను పేరు పెట్టకుండా ఎవరు ఉచ్చరించినా ఎవరిని ఉద్దేశించి అనేది అందరికీ ఎరుకే. తమ నేతలనే అంటున్నారని మద్దతుదారులు కత్తులు, కటార్లు పట్టుకొని వీధులోకి వస్తే కుదురుతుందా ! మహారాష్ట్రలో అలాంటి పదాలలో ‘‘ ద్రోహి, గౌహతి ప్రయాణం,ఆటోవాలా ’’ అనేవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. కునాల్‌ కమ్రా అలాంటి పదాలతో ఎవరి పేరూ ప్రస్తావించకుండా చతురోక్తులు విసిరాడు. మా నాయకుడినే అంటూ ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సిఎం ఏకనాథ్‌ షిండే శివసేనకు చెందిన వారు హాబిటేట్‌ స్టూడియోలో విధ్వంసకాండ సృష్టించారు.కునాల్‌ కమ్రాను నరికి వేస్తామంటూ వీరంగం వేస్తున్నారు. అమెరికా, లాటిన్‌ అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక మంది దేశాధినేతలు, డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి వారిని మీడియాలో, ఇతరంగా అనేక మంది ఫాసిస్టు, నాజీలని నేరుగానే సంబోధించి విమర్శిస్తున్నారు.నోరుబట్టని బూతులను కూడా వినియోగిస్తున్నారు.మామ తిట్టినందుకు కాదు తోడల్లుడు కిసుక్కున నవ్వినందుకు అన్నట్లుగా రాజకీయ పార్టీల నేతలు ఇలాంటి పదాలను ఎలాంటి సంకోచం లేకుండా పరస్పరం వాడేస్తుంటారు. కానీ అదే కళాకారులు వాటిని వ్యంగ్యాస్త్రాలుగా వాడితే మాత్రం సహించరు. మేం మేం వందనుకుంటాం మీరెవరు అన్నట్లుగా స్పందిస్తారు.

తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్దమే అని కునాల్‌ కమ్రా చెప్పాడు. చట్టానికి కట్టుబడి ఉంటానని చెప్పటమే అది. అంతే కాదు గూండా గుంపులను ఉద్దేశించి మరో పేరడీ పాటతో రెండో వీడియోను కూడా విడుదల చేశాడు. తమ దగ్గర కేసు నమోదైంది గనుక వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు, తనకు వారం రోజుల సమయం కావాలని కునాల్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ మేరకు వివరణ ఇవ్వకపోతే చట్టం తనపని తాను చేసుకుపోవాలి. కానీ అతను ప్రదర్శన నిర్వహించిన క్లబ్బు మీద దాడి, అతిక్రమణలంటూ కూల్చివేతలు ఏమిటి ? వచ్చిన జనాల మీద కూడా దాడిచేస్తారా ? అంటే ఎవరూ కునాల్‌ వంటి విమర్శకులు, చతురోక్తులు విసిరే వారికి వేదికలను ఎవరైనా ఇస్తే వాటన్నింటికీ ఇదే గతి పడుతుందని చెప్పటమే కదా ! ఎంతకాలం ఇలా బెదిరిస్తారు, ఎందరి నోరు మూయిస్తారు, ఇదా అసలైన ప్రజాస్వామ్యం అంటే ? దేశం, ఇతర దేశాల నుంచి కునాల్‌కు మద్దతు వెల్లువెత్తుతున్నది, చట్టపరంగా ఎదుర్కొనేందుకు, ధ్వంసమైన స్టూడియోకు చెల్లించేందుకు అనేక మంది లక్షలాది రూపాయలను విరాళంగా కూడా పంపినట్లు వార్తలు వచ్చాయి. రాజకీయ పార్టీల నేతలు, వారిద్రోహాలు, అధికార దాహాల గురించి జనంలో ఉన్న అసంతృప్తి, ఆగ్రహాలకు ఇది నిదర్శనం, గళమెత్తాలని కోరటం తప్ప మరొకటి కాదు. ఏకనాధ్‌ షిండే అనుచరులుగా ఉన్నవారు విధ్వంసకాండకు పాల్పడ్డారు తప్ప, మానేతను అంటారా అని సామాన్య జనం వీధులకు ఎక్కినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. కునాల్‌ పరోక్షంగా చతురోక్తులు వేసిన వారిలో ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ, అంతకంటే శక్తివంతుడిగా పేరున్న అమిత్‌ షా కూడా ఉన్నారు. బాద్‌షా బాద్‌షా అనే సినిమా పాటను అనుకరించి హాస్యం పండిరచాడు. మిస్టర్‌ ఇండియా సినిమాలోని హవా హవాయి పాటకు పేరడీతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మీద కూడా సెటైర్లు వేస్తూ వీడియోను తాజాగా విడుదల చేశాడు.సినిమా హాళ్లలో అమ్మే పాప్‌ కార్న్‌( మొక్క జొన్న పేలాలు) మీద వివిధ రకాల జిఎస్‌టిలను విధిస్తూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కుమ్రా బాంకు ఖాతాలు, వాటి లావాదేవీల గురించి తనిఖీలు, విచారణలు తప్ప వారి అభిమానులు గూండాయిజానికి పాల్పడిన ఉదంతాలేవీ ఇంతవరకు నమోదు కాలేదు.

గతంలో కొందరు రాజకీయ నేతల రూపలావణ్యాలతో చిత్రించిన పాత్రలతో సినిమాలు వచ్చాయి. అంతెందుకు కునాల్‌ కమ్రాను విమర్శించిన బిజెపి ఎంపీ కంగన రనౌత్‌ నిర్మించి స్వయంగా నటించిన ఎమర్జన్సీ సినిమా ఇందిరా గాంధీని విమర్శించటానికి తప్ప మరొకందుకు కాదు. కానీ ఆమె కునాల్‌ కమ్రాకు నీతులు చెబుతున్నారు. ఎమర్జన్సీ సినిమాలో తమ సామాజిక తరగతిని కించపరిచారు, చరిత్రను వక్రీకరించారంటూ సిక్కులు సినిమా థియేటర్ల ముందు ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెలిపారు తప్ప వాటి మీద, లేదా సినిమా నిర్మించిన స్టూడియోల మీద దాడులు చేయలేదు. కానీ పద్మావత్‌ సినిమా విడుదల సమయంలో అలాంటి దాడులు జరిగాయి. సినిమాల ద్వారా సెటైర్లు వేయటం కొత్త కాదు. ప్రఖ్యాత చార్లీ చాప్లిన్‌ గ్రేట్‌ డిక్టేటర్‌ పేరుతో హిట్లర్‌ మీద తీసిన సినిమా గురించి తెలిసిందే. పూర్వపు సోవియట్‌ కెజిబి ఏజంట్లను వెర్రి వెంగళప్పలుగా, సిఐఏ వారిని ఎంతో తెలివితేటలు కలిగిన వారిగా చిత్రించిన సినిమాలు అనేకం, అలాగే కమ్యూనిస్టులను దుర్మార్గులుగా రూపొందించినవీ తెలిసిందే. తెలుగులో రాజకీయ కారణాలతో అలాంటి సినిమాలు రాలేదా ! కానీ తమకు నచ్చని భావజాలం, వార్తలు, కార్టూన్లు, కామెడీ, సినిమాల మీద దాడి చేయటం దుర్మార్గం.

తమకు నచ్చని రచనలు చేసినందుకు, విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్న రోజులివి. కేసులు కూడా పెడుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారందరికీ పెడుతున్న ముద్దు పేరు ద్రోహి అనే కదా ! నైజాం నవాబును వ్యతిరేకించిన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ను నైజాం గూండాలు కాల్చిచంపి, కసి తీరక రచనలు చేసే కుడిచేతిని నరికిన దుర్మార్గం చరిత్రలో చెరిగి పోదు. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన కన్నడ నటి, నిర్మాత స్నేహలతా రెడ్డిని నాటి కాంగ్రెస్‌ పాలకుల బరోడా డైనమెట్‌ అనే తప్పుడు కేసులో ఇరికించి జైల్లో చిత్రహింసలు పెట్టారు, దాంతో ఆమె ఆరోగ్యం దెబ్బతినటంతో విడుదల చేసిన ఐదు రోజులకే ఆమె కన్నుమూశారు.హేతువాదులు, వామపక్ష పవాదులుగా ఉన్న నరేంద్ర దబోల్కర్‌, గోవింద పన్సారే, జర్నలిస్టుగా ఉన్న గౌరీ లంకేష్‌, మేథావి, రచయిత కులుబుర్గిని మతోన్మాదులు మన కళ్ల ముందే బలితీసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా పిరికిబారకుండా తాను నమ్మిన, తగినవి అనుకున్న ఇతివృత్తాలతో కునాల్‌ కమ్రా తన హాస్య కార్యక్రమాలతో అనేక మందితోపాటు, ధోరణులను చీల్చి చెండాడుతున్నారు.తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు. ఇలాంటి మూకలను చూసి భయపడి మంచాల కింద దాక్కొనే వాణ్ణి కాదని చెప్పారు. ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్‌ తన కుంచెతో మహాత్మా గాంధీని, జిన్నా, జవహర్‌లాల్‌ నెహ్రూతో సహా ఎవరినీ వదల్లేదు. హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రికలో ఉద్యోగాన్ని వదులుకున్నాడు తప్ప కుంచెపదును తగ్గించుకోలేదు. నన్ను కూడా వదలకుండా కార్టూన్లు వేయి శంకర్‌ అన్న నెహ్రూ వంటి నేతలు పుట్టిన దేశంలో చిన్న పాటి వ్యంగ్యాన్ని కూడా సహించని వారు నేడు రాజకీయాల్లో పెత్తనం చేస్తున్నారు.తన మీద విసిరిన వ్యంగోక్తిని ఏకనాధ్‌ షిండే వదలివేసి ఉంటే కునాల్‌ వీడియో చూసే వారికి మాత్రమే అది పరిమితమై ఉండేది.అనుచరులతో చేయించిన రచ్చతో ఆ ఉదంతానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందో చూస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే పాత్ర మరింతగా బహిర్గతమైంది. తనకు తానే పరువును బజారుకు ఈడ్చుకున్నట్లు లేదూ !

 

Latest articles

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

REVANTH REDDY: పార్టీ గీత దాటితే… వేటు తప్పదు: సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. పార్టీ నిర్ధేశించిన నియమాలకు...

SUPREME COURT: శిశువుల అక్రమ రవాణా పై… సుప్రీం కోర్టు సీరియస్

ఇటీవల యూపీలోని ఒక ఆస్పత్రిలో నవజాత శిశువు చోరీకి గురయ్యాడు. దీన్ని గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు...

MELINDA GATES: విలువలతో… జీవితం నిలబెట్టుకోలేకపోతే…విడాకులు అవసరమే….మెలిందా

మీ బంధాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన విలువలను మీరు నిలబెట్టుకోలేకపోతే.. విడాకులు అవసరమే... అని మెలిందా అన్నారు. బిల్‌గేట్స్‌ చేసిన...

More like this

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

REVANTH REDDY: పార్టీ గీత దాటితే… వేటు తప్పదు: సీఎం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. పార్టీ నిర్ధేశించిన నియమాలకు...

SUPREME COURT: శిశువుల అక్రమ రవాణా పై… సుప్రీం కోర్టు సీరియస్

ఇటీవల యూపీలోని ఒక ఆస్పత్రిలో నవజాత శిశువు చోరీకి గురయ్యాడు. దీన్ని గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు...