పిల్లల అక్రమ రవాణా విషయంలో… సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడేవారిని చట్టం ముందుంచాలని… అలాంటి ముఠాలు సమాజానికి ఎంతో ప్రమాదకరమని హెచ్చరించింది. నవజాత శిశువులను రూ.లక్షలకు అమ్ముతున్నట్లు వచ్చిన వార్తలపై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది.
పిల్లల అక్రమ రవాణాదారులు.. హంతకులకంటే ప్రమాదకరమని జస్టిస్ పార్థివాలా అన్నారు. ఒక వ్యక్తిని హత్య చేస్తే.. దాని వెనక పలు కారణాలు, ఉద్దేశాలు ఉంటాయి. ఆ తర్వాత అతడు మరో హత్య చేయకపోవచ్చు. కానీ.. పిల్లలను కిడ్నాప్ చేసేవారు…అమ్మేవారు … ఆ నేరాలకు మళ్లీ మళ్లీ పాల్పడుతున్నారు. వారు ఈ సమాజానికి మరింత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో పిల్లల అక్రమ రవాణా వెనకున్న కీలక సూత్రధారిని వెంటనే పట్టుకొవాలని ఆదేశించింది.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చిన్నారులను రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నారని.. దీని వెనక ఒక పెద్ద ముఠా పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని కోర్టు పేర్కొంది. అయితే.. వీరిలో కొందరు చిన్నారులు అపహరణకు గురికాలేదని తల్లిదండ్రులే అమ్మేస్తున్నారని కోర్టుకు పోలీసులు నివేదించారు. పిల్లలు దొరికిన అనంతరం వారిని తిరిగి తల్లిదండ్రులు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే…. అప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోర్టు పేర్కొంది.