* ఓ వ్యక్తి కేక్ తీసుకెళ్తుండగా ప్రశ్నించిన మీడియా
* పాక్ ఎంబసీలో అధికారులు సెలబ్రేషన్స్ జరుపుకున్నారా? అని అనుమానం
దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఒక వ్యక్తి కేక్ బాక్స్‌తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక వ్యక్తి చేతిలో కేక్ బాక్స్ పట్టుకుని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ భవనం వైపు నడుచుకుంటూ వెళ్లడం వైరల్ అయిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అతన్ని ఆపి, “ఇక్కడ ఏం సంబరాలు జరుగుతున్నాయి? కేక్ ఎందుకు తీసుకెళుతున్నారు? మీరు పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన వారా? ఈ బాక్సులో ఏముంది?” అంటూ ప్రశ్నలు కురిపించారు. అయితే, ఆ వ్యక్తి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సమయంలో పాకిస్థాన్ హైకమిషన్‌కు కేక్‌తో వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రదాడితో విషాదఛాయలు అలుముకున్న వేళ… ఇలా కేక్ తీసుకెళ్లి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు.