వంద సంవత్సరాలు అయినా…. జలియన్ వాలాబాగ్ దారుణం. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. నాటి బ్రిటిష్ పాలకులు భారతీయులపై జరిపిన మారణకాండను ఆ దేశ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ యూకే పార్లమెంట్‌లో గుర్తుచేశారు. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రోజు జరిగిన కాల్పుల్లో వేలాది మంది అమాయక పౌరులు చనిపోయారని, పలువురు గాయపడ్డారని విచారం వ్యక్తంచేశారు.
1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ వద్ద శాంతియుతంగా సమావేశమైన అమాయక పౌరులపై కాల్పులు జరుపాలని జనరల్ డయ్యర్ బ్రిటిష్ బలగాలను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు బలగాలు తమవద్ద బుల్లెట్లు పూర్తయ్యేవరకు కాల్పులు జరిపారు. ఆ మారణహోమంలో 1500 మంది ప్రాణాలు కోల్పోగా 1200 మంది గాయపడ్డారు. ఈ చర్య బ్రిటిష్ సామ్రాజ్యంపై మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనిపై బ్రిటీష్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో ఏప్రిల్ 13 రాబోతోంది. దాని కంటే ముందు మన ప్రస్తుత ప్రభుత్వం ఓ ప్రకటన ఇవ్వగలదా? చేసిన తప్పును అంగీకరించి.. భారత ప్రజలకు బ్రిటన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలి అని ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ డిమాండ్ చేశారు.
1919లో రౌలత్ చట్ట వ్యతిరేకులును … సత్యాగ్రహయోధులను కఠినంగా అణచివేయాలని నాటి బ్రిటన్ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించింది. ఆ సందర్భంలోనే జలియన్ వాలాబాగ్ అమానుష ఘటన జరిగింది . మానవజాతి చరిత్రకే మచ్చగా మిగిలింది. 1919లో పంజాబ్‌లో ప్రసిద్ధ నాయకులు డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించింది. ఈ వార్తతో ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. దాంతో ప్రభుత్వం అమృతసర్‌లో మార్షల్ లా విధించింది. నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చే బాధ్యతను జనరల్ డయ్యర్‌కు ఇచ్చింది.
1919 ఏప్రిల్ 13న వైశాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని అమృతసర్‌లోని వాలాబాగ్ మైదానంలో నిరసన సభకు, అలాగే వైశాఖీ వేడుకల కోసం గ్రామీణులు, పట్టణ వాసులు సమావేశమయ్యారు. సమావేశానికి అనుమతి లేదంటూ నిషేధాజ్ఞలు జారీ చేసిన జనరల్ డయ్యర్ సాయుధ దళం.. మైదానాన్ని చుట్టుముట్టింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జన సమూహంపై తూటాల వర్షం కురిపించింది. దీంతో మైదానం శవాల దిబ్బలా మారిపోయింది.