అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఆహార పథకం ’ ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపేసింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అఫ్గానిస్థాన్, సిరియా, యెమెన్ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.
అమెరికా నిర్ణయంపై ప్రపంచంలో అతి పెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుందని తెలిపింది. వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు సంభవిస్తాయి… అని తన ఎక్స్ పేజీలో పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయంపై ట్రంప్ యంత్రాంగంతోనూ…. సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఇప్పటిదాకా చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపింది. కోతల నుంచి ఆహారంతోపాటు ప్రాణాధార అత్యవసర సాయాలను మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతోపాటు ప్రభుత్వ అధికారులు గతంలోనే ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.