REVANTH REDDY:పేదలకు సన్నబియ్యం
రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం సరఫరా చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలుపడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. వారికి ఇష్టం ఉన్నా, లేకున్నా.. ఎన్ని తరాలు మారినా.. ఎవరు ముఖ్యమంత్రి అయినా సన్నబియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయలేరని రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేయలేదన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగసభలో ఉచిత సన్నబియ్యం పథకాన్ని సీఎం ప్రారంభించారు.
దేశంలో పేదల్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో నాడు ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చారు. భూమికోసం జరిగిన పోరాటాలను గుర్తించిన తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంచిపెట్టారు. నాడు ఇందిరాగాంధీ రోటీ, కప్‌డా, మకాన్ నినాదం తర్వాత పేదల్లో చైతన్యం వచ్చింది.. పంట పండించాలి.. తెల్లబువ్వ తినాలి అని ఆలోచించారు. దసరా, దీపావళి, ఉగాది పండగ రోజుల్లోనే తెల్లబియ్యం తినడానికి పరిమితం కారాదని.. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేదలకు రూ.1.90కు కిలో బియ్యం ఇవ్వాలని ఆలోచన చేశారన్నారు.
ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామని….. ఎన్ని వేల కోట్ల రూపాయలు భారమైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని… ఈ పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తామని తెలిపారు. ఉగాది రోజున ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలపారు.