* పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఆగమాగం
* రేవంత్ రెడ్డి ఉద్యోగాలిచ్చే సీఎం కాదు..
* చదువు లేని వ్యక్తి విద్యాశాఖ దగ్గర పెట్టుకుని ఏం చేస్తాడు?
* అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే ఆగమాగంగా ఉందని, రాష్ట్రంలో గ్రూప్ -1 పోస్టులు 563 ఉంటే..200కు పైగా బ్యాక్ డోర్ లో అమ్మేశారని ఆయన ఆరోపించారు. ఆలిండియా స్టేట్ టాపర్ కి 49.5 శాతం మార్కులు వస్తే… ఇక్కడ గ్రూప్ -1 మెయిన్స్‌లో 50శాతం మార్కులు వచ్చిన వాళ్లు 250 మంది ఉన్నారని, ఇది ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు. దీంట్లో పెద్ద కుంభకోణం జరిగిందని, ఉద్యోగాలన్నీ అమ్మేశారని విమర్శించారు.
పరీక్ష రాసిన వారి పేపర్లు పబ్లిక్ డొమైన్లో పెడితే అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు అశోక్. 50 శాతం పైగా మార్కులొచ్చాయంటే కచ్చితంగా ఎగ్జామ్ బయట వాళ్లతో రాయించారని అన్నారు. గ్రూప్ -1 ఫలితాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 57 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ, వాళ్లు ఇచ్చింది 12వేల నోటిఫికేషన్లు మాత్రమేనన్నారు. మిగిలినవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లేనని, కాంగ్రెస్ సర్కార్ కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలిచ్చే ముఖ్యమంత్రి కాదన్న అశోక్…ఆయన కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇస్తారని విమర్శించారు. మాటలతోనే సీఎం రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నారని, ఆయన కనీసం డిగ్రీ కూడా చదవలేదని, విద్యాశాఖను ఆయన దగ్గరపెట్టుకుని ఏం చేస్తారని అశోక్ ప్రశ్నించారు. 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు చేసిందేమీ లేదని విమర్శించారు.