ఉదయం లేచినప్పటీ నుండి రాత్రి పడుకునేవరకూ… ఏ పని చేయాలన్నా స్మార్ట్‌ఫోన్‌నే, కొద్దిసేపు మన దగ్గర లేకపోతే ఏదో పొగొట్టుకున్న ఫీలింగ్… సామాన్లు కొనడానికి యూపీఐ పేమెంట్లు, ఆఫీస్‌కు వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకోవడం, సినిమాకు టికెట్లు, వంటలు చేయడానికి యూట్యూబ్, కాలక్షేపానికి ఇన్‌స్టా ఇలా రోజంతా … ఫోన్ కావాల్సిందే. భారతీయులపై సెల్‌ఫోన్ ప్రభావం గురించి నిర్వహణ సలహాదారు సంస్థ ఎర్నెస్ట్ యంగ్ (ఈవై) ఇండియా ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం… 2024 సంవత్సరంలో భారతీయులు 1.1 లక్ష కోట్ల గంటలు ఫోన్ చూస్తూ గడిపారని తన నివేదికలో వెల్లడించింది.
ఇన్‌స్టా నుంచి నెట్‌ఫ్లిక్స్ వరకు డిజిటల్ వేదికల వినియోగం పెరిగింది. ఈవెంట్లు, క్రికెట్ టోర్నమెంట్లు వంటి ప్రత్యక్ష కార్యక్రమాలను సెల్‌ఫోన్‌లలోనే వీక్షిస్తున్నారని తెలిపింది. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవల వల్ల ప్రజలు అధికంగా ఫోన్‌ను వినియోగిస్తున్నారు. రోజుకు సరాసరి 5 గంటలు ఫోన్ చూస్తున్నారు. 70 శాతం సమయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్, వీడియో సంబంధిత విషయాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల 2024 నాటికి డిజిటల్ ఛానెల్‌లు తొలిసారిగా టెలివిజన్ వీక్షణలను అధిగమించాయి.
దేశంలో దాదాపు 562 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఇది యూఎస్, మెక్సికో జనాభాలను కలిపితే వచ్చే సంఖ్య కంటే ఎక్కువ. 2024లో 5G సబ్‌స్క్రిప్షన్‌లు రెండింతలు పెరిగి 270 మిలియన్లకు చేరుకున్నాయి. అయితే 40 శాతం ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్లు గ్రామీణప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. మొబైల్ ఫోన్లలో గడిపే రోజువారీ సమయంలో ఇండోనేషియా, బ్రెజిల్ ప్రజలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. తర్వాతి స్థానంలో భారతీయులు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో దేశం ‘డిజిటల్ ఇన్‌ఫెక్షన్ పాయింట్’కు చేరుకున్నట్లు ఈవై ఇండియా అధినేత ఆశిష్ ఫెర్వానీ పేర్కొన్నారు.