ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు ఊరట లభించింది. విదేశాల నుంచి భారత్ వచ్చేందుకు ఆయన్ను అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించడంతో ఈవారం చివర్లో శ్రవణ్ రావు హైదరాబాద్ రానున్నారు. పోలీసుల విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 48 గంటల్లో శ్రవణ్ రావు ఇండియాకు వస్తారని సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు. శ్రవణ్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది, అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌కు సుప్రీం ఆదేశించింది. కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తుల అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించగా… జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. శ్రవణ్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. శ్రవణ్‌ను అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరగా ఈ తీర్పు వచ్చింది . శ్రవణ్ రావు 48 గంటల్లో అమెరికా నుంచి భారత్‌కు చేరుకుంటారనే విషయాన్ని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు . శ్రవణ్ రావుకు పోలీసులు నోటీసులు ఇస్తారా …లేక.. విచారణకు పిలిచి అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారా …అనేది తెలియాల్సి వుంది.