హైదరాబాద్: హైదరాబాద్ లో మహిళలపై రోజు రోజుకు దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 22న (శనివారం) ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణిస్తున్న యువతిపై అత్యాచారయత్నం జరిగింది. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మెడ్చల్ కు వెళ్తున్న ట్రైన్ లో యువతి ప్రయాణిస్తున్నప్పుడు బోగీలో ఎవరూ లేకపోవడంతో అదే బోగీలో ప్రయాణిస్తున్న యువకుడు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తప్పించుకునే క్రమంలో ట్రైన్‌లో నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, బాధిత యువతి స్వస్థలం అనంతపురం జిల్లాగా పోలీసులు గుర్తించారు. మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తోంది. సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.