బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సోమవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్ రూ.5258.68 కోట్లతో పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారని తెలిపారు. అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతో పాటు మరో 15ఎకరాలు టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని.. ప్రత్యామ్నాయంగా 50ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు.
దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవాణి ట్రస్టుతో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో నిర్మిస్తామని తెలిపారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటికే పలువురు సీఎంలు ఆలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఏపీలో పలు చోట్ల నిలిచిపోయిన దేవాలయాలను పునర్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకుండా .నెలకు 43 వేలు చెల్లించాలని , సైన్స్ సిటికి టీటీడీ కేటాయించిన 20 ఏకరాలు స్థలం రద్దు, టీటీడీ ఉద్యోగులకు మూడు నెలలకు ఒక్కసారి సుపథం ద్వారా దర్శనం . లైసెన్స్ లేని హ్యాకర్ల నిర్మూలనకు రెవెన్యూ, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, టీటీడీ ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్‌లు ఏర్పాటు, వీఐపీ బ్రేక్ దర్శనాలు గతంలో మాదిరిగానే ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని సూచించాని టీటీడీ చైర్మన్ చెప్పారు. 180 మంది కాంట్రాక్టు లెక్చరర్‌లకు జీత భత్యాల పెంపుపై కమిటీ వేశామన్నారు. వికలాంగులు, వృద్ధులకు అఫ్‌లైన్‌లో టికెట్స్ జారీపై కమిటీ వేశామని వివరించారు.