మెదక్ : సంచలనాలతో రోజూ వార్తల్లో నిలిచే మెదక్ జిల్లా కలెక్టర్ తాజాగా సైకిల్ పై వచ్చి బస్టాండ్ ను తనిఖీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మూడు రోజుల క్రితమే పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్… నిన్న ఉదయం ఆయన భార్య శ్రీజతో కలిసి సైకిల్ తొక్కుకుంటూ మెదక్ నుంచి దాదాపు 20 కి.మీల దూరంలోని రామాయంపేట బస్టాండ్‌కు వచ్చారు. బస్టాండ్‌లోని సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్ వచ్చిన విషయం తెలిసుకున్న డిపో మేనేజర్ సురేఖ హుటాహుటిన బస్టాండ్‌కు వచ్చారు.
ఈ సందర్బంగా కలెక్టర్ డిపో మేనజర్ కు పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని, పరిసరాల్లో చెత్తచెదారం లేకుండా చేయాలని ఆదేశించారు. అనంతరం భార్యతో కలిసి ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకుని సామాన్య పౌరుడిలా మెదక్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో ప్రయాణికులతో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెదక్‌కు చేరుకున్నాక అక్కడి బస్టాండ్‌ను తనిఖీ చేశారు. ప్రజలకు కావాల్సిన వసతులన్నీ కల్పించాలని అధికారులను రాహుల్ రాజ్ ఆదేశించారు.