హైదరాబాద్ : బీజేపీలో సీనియర్ నాయకులను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. నామినేటెడ్ పోస్టులను సీనియర్ నేతలకు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నట్టు వెల్లడించిన ఆయన… ఆ అధ్యక్షుడిని ఎన్నుకునేది రాష్ట్ర పార్టీ కమిటీనా..? లేక జాతీయ నాయకత్వమా..? అని ఆయన ప్రశ్నించారు. కొత్త అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే ఆయన రబ్బర్ స్టాంపుగానే ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గతంలో ఒక అధ్యక్షుడు తన సొంత గ్రూపును తయారు చేసుకొని పార్టీకి చాలా నష్టం చేశారని రాజాసింగ్ ఆరోపించారు. కొత్త పార్టీ అధ్యక్షుడు కూడా అదే విధంగా గ్రూపులను ప్రోత్సహిస్తే.. పార్టీకి నష్టం జరుగుతుందని రాజాసింగ్ అన్నారు. ప్రస్తుతం మంచి నాయకుల చేతులను కట్టిపడేశారని ఆయన విమర్శించారు. సీనియర్ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కొత్త అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య చర్చలు నిర్వహించవద్దని ఆయన సూచించారు.
పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులోని మాటనే తాను బయటపెడుతున్నానని రాజాసింగ్ అన్నారు. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పాలి గానీ, మీడియా ముందుకు వెళ్లవద్దని కొందరు చెబుతున్నారని, కానీ పార్టీ పెద్దల దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడం వల్లే ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందని రాజాసింగ్ పేర్కొన్నారు.