* బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
* రాష్ట్ర సుస్థిర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని వ్యాఖ్య
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ భట్టి విక్రమార్క ప్రసంగించారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని భట్టివిక్రమార్క తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన ‘నీకు కనిపించిన బలహీనులైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో.. నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో’ అనే మాటలను పాటిస్తూ తమ ప్రభుత్వం ముందుకెళుతోందని భట్టివిక్రమార్క చెప్పారు. ప్రజా ప్రయోజనాలు, ప్రజలకు జవాబుదారీతనం.. సుపరిపాలన అందించడంలో సఫలీకృతమయ్యామని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని, ప్రజలు అప్పగించిన బాధ్యతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాము తాకట్టు పెట్టలేదని ఆయన పేర్కొన్నారు.