* ఇక అది సురవరం ప్రతాపరెడ్డి యూనివర్శిటీ
* పొట్టి శ్రీరాములు పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు..
* చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ఆ పేరు పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తా..
* నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు పెడతాం..
* తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం కోసమే తెలుగు యూనివర్శిటీ పేరు మార్చినట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్శిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున తెలంగాణలోని యూనివర్శిటీలు, సంస్థలకు పేర్లు మార్చుతున్నట్టు ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు యూనివర్శిటీ పేరు మార్పు తదితల బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా యూనివర్శిటీలకు పేర్లు మార్చుకున్నామని గుర్తు చేశారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు. సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని, గోల్కొండ పత్రికను నడిపారని గుర్తు చేసుకున్నారు.
పొట్టి శ్రీరాములు పేరును మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదన్న సీఎం… కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమేనని తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉందని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం చూడొద్దని కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి లేఖ రాస్తామన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అనుమతులు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు.
బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి కొణిజేటి రోశయ్య పేరు పెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత అన్నారు. గవర్నర్‌గా, ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా సేవలు అందించారని గుర్తు చేశారు. నేచర్ క్యూర్ ఆస్పత్రికి సమీపంలో రోశయ్య విగ్రహాన్ని నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతిలను నిర్వహిస్తామని తెలిపారు.