– ఎం.కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్.
ప్రపంచ నేతలను మన చుట్టూ తిప్పుకోగల విశ్వగురువుగా నరేంద్రమోడీని కొంత మంది గతంలో వర్ణించారు, అది ఒక కోణంలో నిజమే, బహుళజాతి గుత్త సంస్థలన్నీ మన మార్కెట్‌లో ప్రవేశించేందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నారు. రెండోవైపు చూస్తే ప్రపంచ పెట్టుబడిదారుల నేతలను ప్రసన్నం కావించుకొనేందుకు సంతుష్టీకరించేందుకు మోడీ వారి చుట్టూ తిరుగుతున్నారు. తెరవెనుక జరిగే దీని గురించి కోటి మంది గొంతెత్తినా నమ్మని వారి కళ్లు తెరిపించేందుకు ఒక్క దృష్టాంతం చాలు. ఇప్పుడు అదే జరిగింది, అయినా మేం నమ్మం అనేవారిని ఎవరేం చేయలేరు.అంబానీ చెప్పినట్లు నరేంద్రమోడీ వినటం పదేండ్లుగా జరుగుతున్న సాధారణ విషయం. అదే మోడీ డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవటమే అసలైన వార్త. అదేమిటంటారా ? ఎలన్‌మస్క్ స్పేస్‌ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్ ఉపగ్రహ అంతర్జాల సేవలకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ ఆ కంపెనీ సేవలను తమ ఖాతాదార్లకు అందించటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు జియో అధినేత ముకేష్ అంబానీ, ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్ వెల్లడిరచారు. వారికలా ముందే తెలిసిపోతాయి మరి. దీన్ని బట్టి నేర్చుకోవాల్సిందేమిటంటే ఆలూలేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతను తిరిగి రాసుకోవాలి. ఆలూచూలూ లేకుండానే కొడుకును కనొచ్చు, పేరుపెట్టవచ్చు. స్టార్‌లింక్‌ను మన దేశంలో ప్రవేశపెట్టేందుకు 2021 నుంచి ఎలన్‌మస్క్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికింకా అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే గిస్తే అనే పేరుతో ఒప్పందం చేసుకోవటం విశేషం. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర లాంఛనమే అన్నది తేలిపోయింది. మన దేశ దిగ్గజాలను ఒప్పించేందుకు మెప్పించేందుకు ఇంతకాలం స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వలేదని, ఒక అవగాహనకు వచ్చిన తరువాత పచ్చజెండా ఊపేందుకు నిర్ణయించినట్లు స్పష్టమైంది.
కొంత మంది దృష్టిలో స్వదేశీ కార్పొరేట్ శక్తులు దేశభక్తులు, ఎప్పటి వరకు అంటే కారణాలు ఏమైనప్పటికీ వారు విదేశీ కార్పొరేట్లతో పోరాడినంతవరకు, తరువాత ? స్వాతంత్య్రానికి ముందు మహాత్మాగాంధీకి నాటి ప్రముఖ పారిశ్రామిక, వాణిజ్యవేత్త బిర్లా కుటుంబం ఎంతో మద్దతు ఇచ్చింది. అంతకు ముందు దాదాభాయ్ నౌరోజీ బరోడా రాజు దగ్గర దివాన్(మంత్రి)గా పనిచేశారు, బ్రిటన్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు, మూడుసార్లు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు, రెండవ సోషలిస్టు ఇంటర్నేషనల్లో సభ్యుడిగా కూడా స్వల్పకాలం పని చేశారు. మనదేశ సంపదను బ్రిటన్ ఎలా పీల్చివేస్తున్నదో తెలియచెప్పారు.వారే కాదు, అనేక మంది స్వదేశీ వాణిజ్య, పారిశ్రామికవేత్తలు స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటీష్ వారిని వ్యతిరేకించారు. ఎవడి గోలవాడిది, ఎవరి కారణం వారిది.చాలా మందికి భూ సంస్కరణలు అంటే భూమికోసం, భుక్తికోసం పోరాటాలు జరిపిన కమ్యూనిస్టుల కారణంగానే మనదేశంలో వాటిని ప్రవేశపెట్టారని అనుకుంటారు. అది వాస్తవం కాదు, అసలు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడక ముందే వాటికి నాంది పలికారు. నూతన వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నపుడు దానికి పాతవ్యవస్థ ఆటంకంగా ఉంటే బద్దలు కొట్టి మరీ అవతరిస్తుంది. కోడి గుడ్డులో పిల్ల ఏర్పడగానే అది బయటకు వచ్చేందుకు అంతకు ముందు రక్షణగా ఉన్న పెంకెను బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది తప్ప అయ్యో ఒకనాడు నాకు రక్షణగా ఉందే అని జాలిపడదు. పెట్టుబడిదారీ వ్యవస్థ పురోగమనానికి ఆటంకంగా ఉన్న ఫ్యూడల్ వ్యవస్థను బద్దలు కొట్టటమే ఫ్రెంచి విప్లవ సారం. అది భూసంస్కరణలకు తెరలేపింది. మన దేశంలో స్వదేశీ పెట్టుబడిదారులు ఎదిగేందుకు వలస పాలన, విదేశీ కంపెనీలు ఆటంకంగా ఉన్నాయి. అందుకే బిర్లావంటి పారిశ్రామికవేత్తలు, దాదాభాయ్ నౌరోజీ వంటి వాణిజ్యవేత్తలు కూడా వలస పాలనను వ్యతిరేకించారు. ఇది దోపిడీ వర్గ మిత్రవైరుధ్యం, ప్రతి వలస దేశంలోనూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తరువాత బిర్లా వంటి వారు ఏం చేశారన్నది చూస్తే మరింతగా అర్ధం అవుతుంది.
బడా పరిశ్రమల ఏర్పాటుకు తమ వద్ద తగినంత పెట్టుబడిలేని కారణంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పేరుతో ప్రభుత్వరంగాన్ని ఆమోదించారు. తగిన బలం పుంజుకున్న తరువాత నూతన ఆర్ధిక విధానాల పేరుతో ఒక్క రక్షణ సంబంధిత రంగాలలో తప్ప మిగతా వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెట్టకుండా చేయటంలో విజయం సాధించారు. విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటంతో వాటితో పోటీ పడలేక చేతులు కలిపి సంయుక్త సంస్థల ఏర్పాటుతో లాభాలను పంచుకొనేందుకు చూశారు. ఇవి ముఖ్యంగా ఆటోమొబైల్, బీమా తదితర రంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. స్వరాజ్‌మజ్డా, మారుతీసుజుకీ, ఇండోసుజుకీ, హీరోహోండా, టాటాడైల్మర్,మహింద్రరేనాల్ట్, భారతీఆక్సా ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. సర్దుకుపోదారం రండి అనటానికి ఇవి ఉదాహరణలు. పోటీబడి దెబ్బలాడుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రిలయన్స్‌అమెజాన్ ఉదంతం.దేశంలో రిటైల్ రంగంలో తమకు పోటీ లేకుండా చూసుకోవాలని చూసిన రిలయన్స్‌ను దెబ్బతీసేందుకు ఫ్యూచర్ గ్రూపు దుకాణాలను కొనుగోలు చేయాలని అమెజాన్ చూసింది. దాన్ని పడనీయకుండా రిలయన్స్ రంగంలోకి దిగింది. చివరికి ఫలితం ఏమంటే 2022 నుంచి ఫ్యూచర్ గ్రూపు మూతపడిరది. ముకేష్ అంబానీ నేడు ఎలన్ మస్క్‌తో రాజీకి వచ్చినట్లే అమెజాన్‌తో కూడా చేతులు కలిపి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. నాడు రిలయన్స్‌కు ప్రధాని మోడీ అండగా ఉన్నారు గనుకనే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మూడు రోజుల పాటు ఢల్లీిలో మకాం వేసినా మోడీ దర్శన భాగ్యం కలగక వెనక్కు తిరిగి వెళ్లిపోయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్, ఎయిర్‌టెల్ కంటే బలమైన స్టార్‌లింక్‌కు సాక్షాత్తూ డోనాల్డ్‌ట్రంపే మద్దతు ఇస్తున్నందున దాన్ని అడ్డుకోవటానికి మోడీకి 56 అంగుళాల ఛాతీ సరిపోయినట్లు కనిపించటం లేదు. సముద్రపు భారీ అలలకు వెన్ను వంచి తప్పించుకోవటం తప్ప ఎదురునిలిచినవారెవరూ బతికి బట్టకట్టలేరు, జియో, ఎయిర్‌టెల్ అదే చేశాయి. అడ్డుకొనేందుకు చూసి పోటీ పడలేక తెల్లజెండా ఎత్తి చేతులు కలిపాయి. ఫిబ్రవరి రెండవ వారంలో అమెరికా పర్యటనలో నరేంద్రమోడీతో ఎలన్‌మస్క్ భేటీలోనే ఆ కంపెనీలకు ఉప్పంది ఉంటుంది. ఈ మూడూ కలసి వినియోగదారులకు లబ్దిచేకూరుస్తాయా, ఒక్కటిగా చేరి పీక్కు తింటాయా చూడాల్సి ఉంది.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వ్యాపారాల్లో ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్ అంతర్జాలం అది పెద్దది, 125దేశాల్లో సేవలను అందిస్తున్నది.అనేక సంస్థలను మింగేసింది. మనదేశంలో జియో, ఎయిర్‌టెల్ కూడా అలాంటివే. స్టార్‌లింక్‌ను మనదేశంలో ప్రవేశపెట్టాలని ఎలన్‌మస్క్ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతగా ప్రయత్నిస్తున్నాడో ఈ రెండు కంపెనీల యజమానులు తమ పలుకుబడిని ఉపయోగించి అంతే గట్టిగా ఇప్పటివరకు అడ్డుకున్నాయి. చివరకు ట్రంప్ వత్తిడిని మోడీ అడ్డుకోలేరని గ్రహించి తామే లొంగి ఎంత దక్కితే అంతే ప్రాప్తం అన్నట్లుగా రాజీపడ్డాయి. మన దేశ కార్పొరేట్ల తీరుతెన్నులకు ఇది మరొక నిదర్శనం.2023 డిసెంబరులో చేసిన టెలికాం చట్ట ప్రకారం భూ సంబంధ స్పెక్ట్రమ్ వేలం ద్వారా, ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను అధికారయంత్రాంగం ద్వారా ఒక ఫీజు నిర్ణయించి కేటాయించేట్లు నిర్ణయించారు. ఎలన్ మస్క్ మన మార్కెట్ మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నకారణంగా అందుకు అనుగుణంగా మోడీ సర్కార్ పావులు కదిపిందని వేరే చెప్పనవసరం లేదు. మస్క్ కంపెనీ స్టార్‌లింక్ దరఖాస్తు కేంద్రం ముందు ఉంది. న్యాయమైన పోటీ విధానాన్ని ఎందుకు అనుసరించరని దిగ్గజ కంపెనీలైన అంబానీ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కేంద్రాన్ని అడిగాయి. ప్రభుత్వ విధానం మార్కెట్‌లో అసమాన పోటీకి దారి తీస్తుందని స్పష్టం చేశాయి. రక్షణ, సముద్రయానం,ప్రకృతి విపత్తుల అవసరాల వంటి వ్యవస్థలకు ప్రభుత్వాలు కేటాయింపులు జరపవచ్చని, వాణిజ్య అవసరాలకు మాత్రమే వేలం వేయాల్సిందేనని అవి పేర్కొన్నాయి.చివరకు రాజీ పడ్డాయి.
స్టార్‌లింక్ వలన ఏమిటీ ఉపయోగం అంటే ఇంటర్నెట్ మరింత వేగం పెరుగుతుంది అని చెబుతున్నారు. అంటే స్టార్‌లింక్ కనెక్షన్ ఉన్నవారు ఇలా నొక్కగానే అలా సినిమాలు, ఇతర సమాచారం వారి ముందు వాలుతుంది. మారు మూల ప్రాంతాలకూ ఆ సౌకర్యం ఉంటుంది. వీడియో కాల్స్‌లో మన ముందుఉన్నట్లే బొమ్మలు కనిపిస్తాయి,వినిపిస్తాయి. సినిమాలో ఆకర్షణీయ దృశ్యాలను ముందుగా చూపి వీక్షకులను ఆకర్షించేందుకు చూసినట్లుగానే ఇవన్నీ చూపుతున్నారు, చెబుతున్నారు.ఈ సౌకర్యం లేదా సేవలు పొందేవారు ఎంత మూల్యం చెల్లించాలో ఇంకా తెలియదు.మనదేశంతో భూ సరిహద్దు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులతో, అదే విధంగా చైనా యాప్‌లతో దేశరక్షణకు ముప్పు ఉంటుందని పెద్ద ఎత్తున హడావుడి చేసిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి.పెట్టుబడుల మీద ఆంక్షలు, యాప్‌లను నిషేధించారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌తో కూడా దేశరక్షణకు సంబంధించిన ఆందోళనను అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ(ఎం), కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మేరకు ప్రకటనలు చేశాయి. స్టార్‌లింక్ కనెక్షన్లు తీసుకున్న సంస్థల ద్వారా దేశభద్రత, విలువైన కీలక సమాచారం సరిహద్దులు దాటిపోయేందుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు.టిక్‌టాక్‌ను, ఇతర యాప్‌లను అదే కారణంతో కదా నిషేధించారు, మరి దీన్నుంచి అలాంటి ముప్పులేదా ? రెండిరజన్ల పాలన నడుస్తున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన సమయాల్లో ఉగ్రవాదులు, ఇతరులు స్టార్‌నెట్ సేవలను పొంది సమాచారాన్ని చేరవేసినట్లు డిసెంబరు, జనవరి నెలల్లో గార్డియన్ పత్రిక వెల్లడిరచిన సంగతి తెలిసిందే. భద్రతా దళాలు చేసిన సోదాలలో స్టార్‌లింక్ యాంటెన్నా, ఇతర పరికరాలను పట్టుకున్నారు. అయితే వినియోగించారని చెబితే పరువుపోతుంది గనుక అవి పని చేయటం లేదని లీకులు వదిలారు. ఏదో ఒకసాకుతో 2024లో ఇంటర్నెట్ సేవల నిలిపివేతలో ‘‘నిరంకుశ ’’ పాలన సాగుతున్న మయన్మార్‌లో 85 సార్లు జరిగితే ‘‘ ప్రజాస్వామిక ’’ భారత్‌లో 84 దఫాలు మూసివేసినట్లు సమాచారం. తరువాత 21సార్లతో బిజెపి నిత్యం భక్తి, అనురక్తితో తలుచుకుంటూ పారాయణం చేసే పాకిస్థాన్ ఉంది. ప్రజాస్వామిక దేశాలలో మనదే అగ్రస్థానం. ఇలాంటపుడు ఇంకా అధికారికంగా స్టార్‌లింక్ అనుమతులు లేనపుడే ఇలా ఉంటే ఇచ్చిన తరువాత దాని మీద నియంత్రణ, పర్యవేక్షణ ప్రశ్నార్ధకమే.