పిఠాపురం: అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడలను బద్దలు కొట్టామన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఏపీ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతోటి అడుగుపెట్టాం. దేశం అంతా తలతిప్పి చూసేలా 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించాం… ఇవాళ జయకేతనం ఎగరేస్తున్నాం…. జై జనసేన” అంటూ ప్రసంగించారు పవన్ కల్యాణ్.
2014లో అన్నీ తానై పార్టీ పెట్టానని, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించానని వెల్లడించారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేశామని… ఓడిపోయినా అడుగు ముందుకే వేశామని అన్నారు.
“మనం నిలబడ్డాం… పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం… మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచులను అవమానించారు, ప్రజలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని మన జనసైనికులు, వీరమహిళలు అడిగితే, గొంతెత్తితే వాళ్లపై కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు.
నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ నాయకుడ్ని అక్రమ కేసుల్లో జైల్లో బంధించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, వారి సీనియర్ నేతలను రోడ్డు మీదికి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడ్ని అయితే వారు తిట్టని తిట్టు లేదు, చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదన్నారు. విప్లవ వీరులను గురించి మాట్లాడానంటే.. కమ్యూనిస్టునని కాదు. నా ఐడియాలజీ అందరికీ అర్ధం కాదు.. అందరిలాగా నేను యూనివర్శిటీలకు వెళ్లలేదు. అయినా అన్నింటిపైనా అవగాహన పెంచుకున్నా. అందుకే నేను పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.