హైదరాబాద్: ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా తాము పోరాడతామన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక ఆలోచన, ముందుచూపుతో రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించి, అమలు చేస్తోందని అన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా తాను పనిచేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో తనకు అవకాశం ఇచ్చినా వద్దని చెప్పినట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. పార్టీ అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్ధంకాదని, ఎవరికి, ఎప్పుడు ఏ బాధ్యత ఇవ్వాలో అప్పుడే ఇచ్చి పని చేయించుకుంటుందని ఆమె అన్నారు. పార్టీలో ఉండి పదవులు రాని వారు కాస్త ఓపిక పట్టాలని సూచించారు.
పార్టీ తనకు అవకాశం ఇచ్చినప్పుడే మాట్లాడాలని అనుకున్నానని, అప్పటి వరకు పని చేసుకుంటూ వెళ్లానని విజయశాంతి అన్నారు. అవకాశం కోసం ఎదురు చూశానని, ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉంటుందని, దాని ప్రకారమే అందరూ పని చేయాలని ఆమె సూచించారు.